పూరి చెప్పిన కాకి కథ... ఎవడి కష్టాలు వాడివి

ఆ సమయంలో పూరి చెప్పిన కాకి కథ ఎంతో మంచి మెసేజ్‌ కలిగి ఉంది.

Update: 2024-11-16 16:43 GMT

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ సినిమాలు ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌ హిట్‌లుగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు కాస్త గతి తప్పుతున్నాయి. ఆయన సినిమాలు ఫెయిల్‌ అయినా ఆయన క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన అంటే పడిచచ్చే వారు ఇంకా చాలా మందే ఉన్నారు. ఆయన తన మనసులో ఉన్న మాటలను ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా చెప్పేస్తూ ఉంటారు. ఆయన పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు రకాల టాపిక్స్ పై మాట్లాడుతూ ఉంటారు. తాజాగా అన్‌హ్యాపీనెస్‌ అనే అంశంపై మాట్లాడారు. ఆ సమయంలో పూరి చెప్పిన కాకి కథ ఎంతో మంచి మెసేజ్‌ కలిగి ఉంది.

పూరి చెప్పిన కథ.. ఒక కాకి చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. అదే చెట్టు కింద కూర్చున్న సాధువు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కాకిని అడిగాడు. అప్పుడు కాని నేను నల్లగా ఉండటం వల్ల ఎవరు నన్ను దగ్గరకు తీసుకోవడం లేదు, నేను వెళ్లి ఏ ఇంటి మీద వాలినా కట్టెతో కొట్టి తరిమేస్తున్నారు. నల్లగా ఉన్న నన్ను ఎవరు ఇష్టపడటం లేదు అంటూ కాకి తన గోడు చెప్పుకుంది. అప్పుడు ఆ సాధువు పక్కనే ఉన్న హంస దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉందో లేదో కనుక్కో అని చెప్పాడు. వెంటనే కాకి వెళ్లి హంసను కలిసింది. అప్పుడు హంస మాట్లాడుతూ నాది ఒక అందమేనా, తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను, నా జీవితం మొత్తం ఈ కొలనులోనే తిరుగుతూ బతకాలి. ఆ చిలుక చూడు ఎంత అందంగా, స్వేచ్చగా ఉందో అంటూ చిలుక వైపు చూపించింది.

హంస చూపించిన చిలుక వైపు కాకి వెళ్లింది. నువ్వు చాలా అందంగా ఉంటావు, మరి సంతోషంగా ఉన్నావా అంటూ కాకి ప్రశ్నించింది. అప్పుడు చిలుక మాట్లాడుతూ నేను అందంగా పుట్టడమే శాపం, ఈ జనాలు నన్ను పంజరంలో పెట్టి చిత్రవధ పెడుతున్నారు. అక్కడ నుంచి ఎగిరి పోవాలని ఎంత ప్రయత్నించినా నేను ఎగరలేను. జీవితాంతం నేను అందులోనే ఉండాల్సిందే. నా కంటే ఆ నెమలి ఎంతో బెటర్‌ అంటూ అటు వైపు చూపించింది. వెంటనే కాకి వెళ్లి నెమలి సంతోషం గురించి ప్రశ్నించింది.

నెమలి తన కష్టాలను చెబుతూ ఈ జూలో నన్ను తీసుకు వచ్చి పడేశారు. వచ్చి నాతో ఫోటోలు దిగుతూ పురి విప్పమని విసిగిస్తూ ఉంటారు. సమయం సందర్భం లేకుండా ఎలా పురి విప్పుతాము. నీ జీవితమే చాలా బెటర్‌, నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు, నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు అంటూ కాకితో నెమలి చెప్పింది. పక్కవాడిని చూసినప్పుడు వాడు మనతో పోల్చితే చాలా సంతోషంగా ఉన్నాడని అనుకుంటాం. కానీ వాడికి ఉండే కష్టాలు వాడికి ఉంటాయి. కనుక ఎదుటి వాడు ఏదో సంతోషంగా, సుఖంగా మనకంటే ఆనందంగా ఉన్నాడని మనం ఏడవడం అనేది అవివేకం అంటూ మంచి మెసేజ్‌ను పూరి జగన్నాధ్‌ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News