SSMB29 మ‌హేష్‌ ద్విపాత్ర‌లు 9 గెట‌ప్పులు?

తన సినిమాల్లో ద్విపాత్ర‌లు త్రిపాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌పై ఘాడ‌మైన ముద్ర వేయ‌డం శంక‌ర్ కే చెల్లింది.

Update: 2024-03-12 05:26 GMT

తన సినిమాల్లో ద్విపాత్ర‌లు త్రిపాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌పై ఘాడ‌మైన ముద్ర వేయ‌డం శంక‌ర్ కే చెల్లింది. అత‌డు తెర‌కెక్కించిన ప్ర‌తి సినిమాలో క‌థానాయ‌కుడు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో క‌నిపిస్తాడు. ఇక ఎంచుకున్న క‌థ‌లో ద్విపాత్ర‌లు, త్రిపాత్ర‌లు క్రియేట్ చేయ‌డం వాటితో అద్భుతాలు చేయ‌డం వంటివి శంక‌ర్ కి వెన్న‌తో పెట్టిన విద్య‌. భార‌తీయుడు - అప‌రిచితుడు- ఐ- రోబో వంటి చిత్రాల్లో ఈ త‌ర‌హా ప్ర‌యోగాలు ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

అయితే ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న సినిమాలోను క‌థానాయ‌కుడు ద్విపాత్ర‌లు లేదా త్రిపాత్ర‌ల్లో క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అంతేకాదు మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అత‌డు మొత్తం తొమ్మిది (9) లుక్కు(గెట‌ప్పు)ల్లో క‌నిపిస్తాడ‌ని కూడా ఇటీవ‌ల‌ క‌థ‌నాలొచ్చాయి. అయితే రాజ‌మౌళి ఈసారి భారీ ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని ఇప్ప‌టికి వ‌చ్చిన స‌మాచారాన్ని బ‌ట్టి అంచ‌నా వేయొచ్చు.

ఇక త‌న పాత్ర‌ల కోసం మ‌హేష్‌ ఇప్ప‌టికే ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు. ఇటీవ‌ల లీకైన ఫోటోల‌ను బ‌ట్టి మహేష్ బాబు గడ్డం పొడవాటి జుట్టుతో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవ‌స‌ర‌మైన‌ పరివర్తనను సాధించడానికి మ‌హేష్ కఠినమైన ఫిట్‌నెస్ నియమావళిని అనుస‌రిస్తున్నాడు. ఎంపిక చేసుకున్న‌ కథకు, మ‌హేష్ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి లుక్‌ను ఖరారు చేయడానికి ముందు టెస్ట్ ఫోటోషూట్‌లు కూడా నిర్వహించనున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ వేగంగా పూర్త‌వుతోంది. ఆగ‌స్టులో మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమాని అధికారికంగా లాంచ్ చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. ఈలోగానే మ‌హేష్ ప్రీప్రిప‌రేష‌న్ వ‌ర్క్ ని పూర్తి చేస్తారు. ఈ సినిమాకి మ‌హ‌రాజ్ అనే టైటిల్ ని ఎంపిక చేసే వీలుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

SS రాజమౌళితో మహేష్ బాబు చిత్రం నిస్సందేహంగా భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. అద్భుతమైన తారాగణం, అసాధార‌ణ‌ కథాంశం .. రాజమౌళి దూరదృష్టి.. దర్శకత్వ ప్ర‌తిభ‌ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంద‌ని అంచ‌నా. అలాగే ఈ సినిమా క‌థాంశాన్ని ప్ర‌ముఖ ద‌క్షిణాఫ్రికా న‌వ‌లా ర‌చ‌యిత ర‌చ‌న‌ల ఆధారంగా రూపొందించామ‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇంత‌కుముందు తెలిపారు. ``నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కానీ రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది`` అని విజ‌యేంద్రుడు తెలిపారు. తాజా ఊహాగానాల న‌డుమ మ‌హేష్ తొమ్మిది లుక్కులు, రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌నేది అభిమానుల్లో మ‌రింత ఉత్కంఠ‌ను పెంచుతోంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News