దీపాన్ని ముద్దు పెట్టుకుంటున్న పార్టీలు.. చివరకు మిగిలేదేంటంటే!!
మీరంతా ఈ బిల్లుకు ఎందుకు మద్దతిస్తున్నారో.. మీ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించుకోండి
''మీరంతా ఈ బిల్లుకు ఎందుకు మద్దతిస్తున్నారో.. మీ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించుకోండి. ఈ రోజు మా కొంపను తగలబెడుతుంటే.. మీరంతా పెట్రోల్ సరఫరా చేస్తున్నారు. కానీ, రేపు.. ఇవే మంటలు.. మిమ్మల్ని.. మీ రాష్ట్రాలను తగలబెడితే.. మేం చూస్తూ ఊరుకోం.. నిరాయుధలను చేసినా.. ఉత్త చేతులతో అయినా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తాం''- ఇదీ.. రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల సవరణ బిల్లు(ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాగేసుకునేదిగా విపక్షాలు చెబుతున్నాయి)పై జరిగిన చర్చల సందర్భంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ.. రాఘవ్ చద్దా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో మేలిమి వ్యాఖ్యలు!!
నిజమే.. మంట అంటూరాజుకోవడం మొదలు పెడితే.. ఆపేవారు కూడా చేతులు ముడుచుకుని.. లేదా.. మరింత ఇంధనం పోస్తే.. అది పాకుతుందే తప్ప ఎక్కడా చల్లారదు. ఇప్పుడు సాయం చేసిన వారిని కూడా అవే మంటలు అంతమొందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతగా ఈ ఢిల్లీ బిల్లుపై ఎందుకు గాభరా అంటే! ఒక పంతం-ఒక కక్ష ఈ బిల్లుకు పునాదులు వేశాయి కాబట్టే!!
ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కారును నేరుగా ఢీకొనేందుకు.. అనేక ప్రయాసలు పడిన బీజేపీ పెద్దలు.. అవేవీ సాధ్యం కాకపోవడంతో అచేతనం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకువచ్చారనడంలో సందేహం లేదు. ఇక, ఇప్పుడు కేజ్రీవాల్ 'కేవలం ముఖ్యమంత్రి'. ఎంతగా అంటే.. ఆయన వద్ద నియమితులైన.. ప్యూన్ ఆయన మాట వినకపోయినా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా తీసుకువెళ్లే బిల్లు ఇది.
సరే.. ఈ బిల్లుకు మేమంటే.. మేం.. మద్దతిస్తామంటూ.. క్యూ కట్టుకుని మరీ అనేక పార్టీలు మద్దతిచ్చాయి. నిజానికి ఎన్డీయే(మోడీ కూటమి) పక్షాలు ఈ బిల్లుకు మద్దతిచ్చాయంటే అర్థం ఉంది. కానీ, నిత్యం ప్రజాస్వామ్య పాటపాడే.. రాష్ట్రాలపైకి కేంద్రం పెత్తనం పెరిగిపోయిందన పదే పదే వగచే.. బీజేడీ(ఒడిశా అధికార పార్టీ), టీడీపీ(ఏపీ విపక్ష పార్టీ), ఎన్సీపీ(అజిత్ పవార్ ఇటీవలే బీజేపీతో చేతులు కలిపారు) వంటివి కూడా ఎగేసుకుని.. తగుదునమ్మా అంటూ.. చేతులు కలపడమే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
నిజానికి బీజేపీ వ్యూహం తెలిసే వీరంతా ఈ పనిచేస్తున్నారా? అనే డౌట్లు కూడా వస్తున్నాయి. బీజేపీకి అధికార కాంక్ష. దాహం.. ఇంకా ఎన్ని పేర్లుంటే అన్నీ పెట్టుకోవచ్చు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు.. ఈశాన్యం దాకా.. కూడా కాషాయ జెండాను రెపరెపలాడించాలని.. వచ్చే పాతిక సంవత్సరాల్లో దేశంలో ఆ పార్టీ మినహా మరోపార్టీ ఉండకూడదనే అప్రకటిత లక్ష్య సాధనలో ఈ పార్టీ తలమునకలై పోయింది. ఇప్పుడు ఢిల్లీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను నిమిత్తం మాత్రం చేస్తే.. అప్పుడు ఎవరు ఆదుకుంటారు.
నిజానికి ఇప్పటికే రాష్ట్రాల అధికారాలను లాగేసుకుంటున్నారని, గ్రాంట్స్ (తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని) తగ్గించి అప్పులు ఇస్తున్నారని కేసీఆర్, మమత వంటి ముఖ్యమంత్రులు తలపట్టుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో కేంద్రం దూకుడుకు కళ్లెం వేయకుండా.. తగుదునమ్మా అంటూ.. సపోర్టు చేయడం ద్వారా.. ఆయా పార్టీలు.. దీపాన్ని ముద్దు పెట్టుకుంటే.. నష్టం ఎవరికి? కష్టం ఎవరికి? ఇది..ఇ ప్పటికిప్పుడు కాకపోవచ్చు..కానీ సమీప భవిష్యత్తలో దేశంలో విస్తరించాలని భావిస్తున్న బీజేపీ లక్ష్యానికి పదును పెరిగితే.. రాఘవ్ చద్దా చెప్పిన వ్యాఖ్యలు అప్పుడు గుర్తుకు రావడం ఖాయం! అంటున్నారు పరిశీలకులు.