ఆధార్ తో ఆన్ లైన్ సేవలు... టీటీడీ కీలక నిర్ణయం!

ఈ సమయంలో టీటీడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది!

Update: 2024-06-30 09:28 GMT

వెంకన్న భక్తులకు తిరుమలలో ఎదురవుతున్న ఇబ్బందుల సంగతి తెలిసిందే! ప్రధానంగా దర్శనం టిక్కెట్లను డూప్లికేషన్ చేయడం, టీటీడీ సేవలకు సంబంధించి నకిలీ వెబ్ సైట్స్ సృష్టించడం, ఆన్ లైన్ సేవలనూ మానిప్యులేట్ చేయడం వంటి పలు సమస్యలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దళారుల దందాలు ఆగడం లేదు. ఈ సమయంలో టీటీడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది!

అవును.. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రతీ రోజూ భక్తుల తాకిడి ఎలా ఉంటుందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా సెలవు దినాల్లోనూ, వారాంతాల్లోనూ నెలకొనే రద్దీ గురించి చెప్పేపనే లేదు. ఈ సమయంలో దళారులు చెలరేగిపోతున్నారు. ఇందులో భాగంగా డికెట్ల డూప్లికేషన్ అనేది వీరివల్ల వస్తోన్న అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమయంలో ఈ సమస్యలను పరిష్కరించడానికి టీటీడీ ముందుకు కదిలింది.

ఇందులో భాగంగా... భక్తులకు అందించే ఆన్ లైన్ సేవలన్నింటినీ ఆధార్ కార్డ్ తో అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఆన్ లైన్ సేవలను ఆధార్ తో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి వీలవుతుందని అంటున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామల రావు ఆదేశించారు.

వాస్తవానికి టీటీడీ దర్శనం టిక్కెట్లు, వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు భక్తులకు ఉంది. అయినా కూడా దళారుల బెడద తప్పడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు సరైన పరిష్కారం ఆన్ లైన్ సేవలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంఏ అని.. దీనిపై అధ్యయనం చేయాలని శ్యామలరావు తెలిపారు!

కాగా... శనివారం సుమారు 80,404 మంది భక్తుల్లు స్వామివారిని దర్శించుకోగా.. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించారు. ఇక ఆ ఒక్కరోజూ హుండీ ఆదాయం 3.83 కోట్లు అందింది. మరోపక్క వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లూ నిండిపోయాయి. ఈ సమయంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటలు సమయం పట్టింది!

Tags:    

Similar News