ఆ మూడంటే మూడ్ లేదు...కొత్త మ్యాటరుంటే చూడు గురూ...!?
ఏపీలో మాత్రం పాత హామీలు ఎప్పటికీ ఆరని తీరని ఆశలతో కూడిన హామీలనే జనాల మీదకు వదులుతున్నారు.
ఏపీలో విభజన తరువాత మూడవ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ముచ్చటగా సాగే మూడవ ఎన్నికల్లో కూడా పాచిపోయిన లడ్డూలాంటి పాత హామీలే దొర్లుతున్నాయి. ఇదేమిటి ఏపీ ఖర్మ అని జనాలు అనుకునే సీన్ ఉంది అంటున్నారు. అదే తెలంగాణాను చూడాలంటే కొత్త హామీలు చాలానే ఉన్నాయి. పైగా కొత్త నాయకత్వం. రేవంత్ రెడ్డి వంటి దూకుడు నేత జనంలోకి రాగానే అందుకే అధికారం అప్పగించారు రెండవ మాట లేకుండా.
ఏపీలో మాత్రం పాత హామీలు ఎప్పటికీ ఆరని తీరని ఆశలతో కూడిన హామీలనే జనాల మీదకు వదులుతున్నారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2014లో కూడా రాజధాని, ప్రత్యేక హోదా పోలవరం హామీలతో టీడీపీ ప్లస్ బీజేపీ జనం ముందుకు వెళ్లాయి. జనసేన సపోర్ట్ ఇచ్చింది. జనం జై కొట్టారు. సూపర్ సక్సెస్ అయి అధికారం చేతిలో పడింది.
ఇక 2019లో జగన్ వైపు నుంచి ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ వచ్చింది. పోలవరం అమరావతి మీద పెద్దగా నాడు వైసీపీ ప్రచారం చేయలేదు కానీ టీడీపీ మాత్రం వాడుకుంది. కానీ రిజల్ట్ వైసీపీ వైపు మళ్ళింది. ఈ మధ్యలో కొన్ని జరిగిన నిజాలు ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్రం చేతిలో ఉందని, అది ఎపుడు అవుతుందో తెలియదు అని.
ఇక అమరావతి రాజధాని భారీ కాన్వాస్ మీద గీసిన స్కెచ్ అని అది కూడా ఇబ్బందులలో పడిందని. అసలైనది మరోటి ఉంది. అదే ప్రత్యేక హోదా. ఏ ముహూర్తాన జనసేనాని పాచిపోయిన లడ్డు అని అన్నాడో కానీ హోదా నినాదం అలాగే పాచిపోయింది.
ఇపుడు మళ్లీ వాటినే తీసి చంద్రబాబు 2024 ఎన్నికల్లో ప్రయోగిస్తున్నారు కానీ జనాలకు ఏ మాత్రం కిక్ ఇవ్వడంలేదు. ఎందుకంటే వాటి మీద జనాలు ఆశలు పెంచుకుని పందెం కాసి ఓట్లు ఒడ్డిన పార్టీలు ఆనక ఏమీ చేయలేకపోయాయి అన్న బాధ ఆవేదన ఏదైతేనేమి జనాలలో ఉంది. ఏపీ అప్పుల కుప్ప అని ఒక వైపు అంటూనే ఉచిత హామీలు ఇస్తూంటే కూడా జనాలు అదోలా చూస్తున్నారు.
ఏపీ ఏమైపోతుందో అన్న బెంగ అయితే జనాలకు లేదు. ఎందుకంటే నిండా మునిగిన తరువాత చలి తెలియని స్థితి వారిది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో వారి మీద వీరు వీరి మీద వారు ఎగదోసుకుని విమర్శలతో వేడెక్కిపోయినా మాటలతో మంటెక్కిపోయినా జనాలలో చలనం ఉంటుందా అన్నది ఒక నిఖార్సు అయిన సందేహంగా ఉంది.
ఏపీకి ఏమి కావాలి అంటే అన్నీ కావాలి. ఏమీ లేవు అంటే ఏవీలేవు. మరి అన్నీ ఒక్క రోజులో అవుతాయా అంటే అయ్య్దేది లేదు చేసేది లేదు. అయిదేళ్ళ టైంలో దశాబ్దాల పాటు సాగే ప్రాజెక్టులను జనం ముందుంచి మేమే అన్ని చేస్తామని చెప్పినా లేక మాతోనే అన్నీ అని చెప్పినా నమ్ముతారా అన్నది పెద్ద డౌట్. ఎందుకంటే ఇది ఇస్మార్ట్ యుగం. ఫోన్ ఉన్న ప్రతీ వారికీ వేయి మెదళ్ల ఆలోచనలు ఉన్నాయి.
మరి ఎలా ఎన్నికల గోదారిని ఈదడం ఏ హామీలతో జనాలను మంచి చేసుకోవడం అంటే ఏమో 2024 ఎన్నికలు మాత్రం చాలా పెద్ద పరీక్షనే పెట్టేస్తున్నాయని చెప్పక తప్పదు. జనం మనసుని గెలుచుకోవడం ఎలా అన్నదే ఈసారి ఎన్నికలలో అసలైన టాస్క్. ఎనీ డౌట్స్.