నీ ఇంట్లో నువ్వే చిచ్చు పెట్టుకుని మాపై పడటమేంటి!

పంచాయతీ సర్పంచ్‌ ల రాష్ట్ర స్థాయి సదస్సులో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌ వ్యాఖ్యలపై హాట్‌ కామెంట్స్‌ చేశారు

Update: 2024-01-04 05:19 GMT

వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రతిపక్షాలు.. కుటుంబాల్లో కూడా చిచ్చుపెడతాయని జనవరి 3న కాకినాడ సభలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. నీ ఇంట్లో నువ్వే చిచ్చు పెట్టుకుని మాపై పడటమేంటి అని నిలదీశారు. నీ ఇంట్లో చిచ్చు పెట్టాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు.

పంచాయతీ సర్పంచ్‌ ల రాష్ట్ర స్థాయి సదస్సులో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌ వ్యాఖ్యలపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. 'తన ఇంట్లో తాను చిచ్చుపెట్టుకున్న జగన్‌.. ఇప్పుడు మాపై పడడమేంటి? జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతున్నారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని ఆయన సరిగా చూసుకోలేకపోతే మాకేంటి సంబంధం? ఏదో రకంగా ఇతరులపై బురదజల్లి బతకడం కూడా రాజకీయమేనా? ఇది ఒక రాజకీయమా? ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ జగన్‌ పింఛన్ల పెంపు అంటూ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి రాజకీయ పార్టీలను విమర్శించారు కాబట్టే స్పందిస్తున్నా' అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్‌ నాటికి జగన్‌ మాజీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఎక్కడికో పోతారు, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది అని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్‌ కే వాయిదా వేసిందని గుర్తు చేశారు. అమరావతిని మార్చడం జగన్‌ వల్ల కాదన్నారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మూడు ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

ఇక పోలవరం పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్, ఇంజనీర్లను మార్చేసి పోలవరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్త పనులతో డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందన్నారు. కాఫర్‌ డ్యామ్‌ ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని విమర్శించారు.

స్థానిక సుపరిపాలన – ఆత్మ గౌరవం – ఆత్మ విశ్వాసం డిక్లరేషన్‌ ను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తోందని, ఈ డిక్లరేషన్‌ ను తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్‌ లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరతామని చెప్పారు. ఫైనాన్స్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌ లో కనీసం 5శాతం నిధులు పంచాయితీలకు కేటాయిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ నిధులను 10శాతానికి పెంచుతామని వివరించారు.

గ్రామంలో ఏ పని జరగాలన్నా సర్పంచ్, పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేలా కార్యక్రమాలు రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. తమకు సేవ చేసేందుకు ప్రజలు సర్పంచ్‌ లను ఎన్నుకుంటే, తన సేవ కోసం జగన్‌ వలంటీర్లను నియమించారని మండిపడ్డారు. వలంటీర్లు కూడా సర్పంచ్‌ ల ఆదేశాలతో ప్రజా సేవ చేయాలి కానీ జగన్‌ సేవ చేయకూడదని సూచించారు.

ప్రజాస్వామ్యంలో స్థానిక పాలన గౌరవాన్ని జగన్‌ తగ్గించేశారని మండిపడ్డారు. పంచాయతీల వ్యవస్థ ఎదుగుదలను ఎక్కడికక్కడ నరికేశారన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక సర్పంచ్‌ లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామన్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు రూ.15వేలు.. జెడ్పీ చైర్మన్, మేయర్‌ ల గౌరవ వేతనాన్ని రూ. 50 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News