హ్యాట్రిక్ విజయం కోసం గులాబీ పార్టీ అలాంటి పనులు చేస్తోందా?

కేసీఆర్ సర్కారు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి.. మేడిగడ్డ కుంగిపోవటంపై గులాబీ పార్టీ పెద్ద ఎత్తున ఇరుకున పడింది.

Update: 2023-11-13 04:43 GMT

పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికల్లో విజయం సాధించాలని తపిస్తోంది. హ్యాట్రిక్ విజయంతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోబెట్టేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కాలికి బలపం కట్టుకొని మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రి కేటీఆర్..హరీశ్ లో ప్రయత్నిస్తున్నారు. అయితే.. గతానికి భిన్నంగా ఈసారి గులాబీ పార్టీ ఎంచుకున్న ప్రతి ప్రయత్నం ఎదురు తిరుగుతోంది. దెబ్బ మీద దెబ్బ పడుతోంది.

కేసీఆర్ సర్కారు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి.. మేడిగడ్డ కుంగిపోవటంపై గులాబీ పార్టీ పెద్ద ఎత్తున ఇరుకున పడింది. దీంతో.. ఎదురుదాడికి దిగారు. కుట్ర కోణం ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. కొంత అలజడి మొదలైనా.. కుట్ర కోణం ఎస్టాబ్లిష్ కాకపోవటం ఒక ఎత్తు అయితే.. నిపుణుల టీం మాత్రం డిజైన్ లోపమని చెప్పటంతో కేసీఆర్ అండ్ కో గతుక్కుమనే పరిస్థితి. దీంతో.. మేడిగడ్డ మీద మాట్లాడటాన్ని తగ్గించటం కనిపిస్తుంది.

అందులోనే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఎపిసోడ్ లోనూ.. నింద కాంగ్రెస్ పార్టీ మీద వేయటం.. అయితే అలాంటిదేమీ లేదన్న విషయం ఫ్రూవ్ అయ్యింది. ఈ అంశంపై కాంగ్రెస్ మాట్లాడుతూ.. కొత్త మీద జరిగిన దాడికి సంబంధించిన విచారణ రిపోర్టును ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక సంచలన కేసుకు సంబంధించిన విచారణలో ఏం తేలిందని ప్రశ్నించటంతో పాటు.. ఆ వివరాల్ని తమకు ఇవ్వాలని టీపీసీసీ రేవంత్ అడుగుతున్నారు. దీనిపై బదులు రాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా గువ్వల బాలరాజు పేరుతో సాగుతున్నదంతా ఉత్త డ్రామాగా రేవంత్ ఫైర్ అయ్యారు. గువ్వల డబ్బులు పంచుతున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు చెబితే.. వారు తమ వాళ్ల మీదనే కేసులు పెట్టారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కీలకమైన ఎన్నికల వేళ ఏదో ఒక భావోద్వేగ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి తుది ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే కేసీఆర్ ప్లాన్ అంటూ మండిపడుతున్నారు రేవంత్. కాసేపు టీపీసీసీ చీఫ్ మాటల్నిపక్కన పెడితే.. ఎన్నికలు మొదలైన నాటి నుంచి అధికార పార్టీకి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎదురుదెబ్బలు తగులుతున్నాయని.. ఇలాంటివి గతంలోఎప్పుడూ ఎదురు కాలేదన్న వాదన వినిపిస్తోంది. అందులో నిజం ఎంతన్న విషయం ఎన్నికల ఫలితాల్ని చూస్తేనే ప్రజల తీర్పు ఎలా ఉందన్నది అర్థమయ్యేది.

Tags:    

Similar News