ఎంఎల్ఏలకు కొత్త తలనొప్పులు

ఇంతకీ విషయం ఏమిటంటే సంక్షేమపథకాల లబ్దిదారుల జాబితాలను ఎంఎల్ఏలు తయారుచేయాలని కేసీయార్ ఆదేశించారు.

Update: 2023-09-09 05:00 GMT

ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, అభ్యర్ధులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది వ్యవహారం. ఇంతకీ విషయం ఏమిటంటే సంక్షేమపథకాల లబ్దిదారుల జాబితాలను ఎంఎల్ఏలు తయారుచేయాలని కేసీయార్ ఆదేశించారు. వివిధ పథకాల్ల లబ్దిదారులను ఎంపికచేయటం ఇపుడు కత్తిమీదసాము లాగ తయారైంది. నిబంధనల ప్రకారం లబ్దిదారులను ఎంపికచేయాల్సొస్తే చాలామంది అనర్హులవుతారు. కొంతమందిని మాత్రమే లబ్దిదారులుగా ఎంపికచేసి మిగిలిన వాళ్ళని వదిలేస్తే జనాలకు మండిపోవటం ఖాయం.

అలాగని అందరినీ ఎంపికచేస్తే అది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లవుతుంది. అప్పుడు ప్రతిపక్షాల నుండి సమస్యలు మొదలవుతాయి. పైగా లబ్దిదారులుగా ఎంపికచేసిన వారంతా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఓట్లేస్తారనే గ్యారెంటీలేదు. లబ్దిదారుల ఎంపిక అనేటప్పటికి సీనియర్ నేతలు, మండలస్ధాయిలో గట్టిపట్టున్న నేతలు కూడా జాబితాలను రెడీ చేసుకుని వస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో ఎంఎల్ఏ రాములునాయక్ ఒక జాబితా ఇస్తే టికెట్ తెచ్చుకున్న మదన్ లాల్ మరో జాబితా ఇచ్చారు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలైంది.

పార్టీలోనే ఒకరిచ్చిన జాబితాను రద్దుచేసి తమ జాబితానే తీసుకోవాలని అధికారులపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, సొంత స్ధలం ఉంటే ఇంటికోసం రు. 3 లక్షలు ఇవ్వటం, బీసీ బంధు, దళితబంధు, మైనారిటీలకు లక్ష రూపాయల సాయం లాంటి పథకాల లబ్దిదారుల ఎంపిక ఎంఎల్ఏలకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పటికే అనర్హులను ప్రభుత్వం దూరంగా పెట్టి కేవలం పార్టీ క్యాడర్ కు మాత్రమే పథకాలను వర్తింపచేస్తోందనే ఆరోపణలు, నిరసనలు బాగా జరుగుతున్నాయి. పథకాల అమలులో అనేక అవకతవకలున్నాయని ప్రతిపక్షాలు కూడా గోలచేస్తున్నాయి. చివరకు పథకాల లబ్దిదారుల ఎంపికే అభ్యర్ధుల కొంపముంచేస్తుందనే టాక్ పార్టీలో పెరిగిపోతోంది.

పైగా ద్వితీయశ్రేణి నేతల సిఫారసులను కాదంటే వాళ్ళు కూడా ఎంఎల్ఏ అభ్యర్ధులకు అడ్డంతిరిగే అవకాశముంది. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక కేసీయార్ తో మాట్లాడుదామని ప్రయత్నిస్తున్నారు. కేసీయార్ ఏమో ఎవరికీ అందుబాటులోకి రావటంలేదు. చివరకు ఏమవుతుందో ఏమో చూడాలి.

Tags:    

Similar News