ఒకే ఒక్కడు... మూడున్నర లక్షల ఎకరాలు తగులబెట్టేశాడు!
కొంతమంది చేసే పనులు ప్రపంచానికి కలిగించే సమస్యలు, ప్రకృతికి తెచ్చే ముప్పులూ అన్ని ఇన్నీ కాదు.
కొంతమంది చేసే పనులు ప్రపంచానికి కలిగించే సమస్యలు, ప్రకృతికి తెచ్చే ముప్పులూ అన్ని ఇన్నీ కాదు. ఇందులో కొంతమంది తెలియక చేస్తుంటే.. కొంతమంది కావాలని పైత్యంతో చేస్తుంటారు! ఈ క్రమంలో తాజాగా ఉత్తర కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి కారణంగా దారుణ పరిస్థితి నెలకొంది.. లక్షల ఎకరాల అడవి కాలి బూడిదైపోయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు!
అవును... ఉత్తర కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి కారణంగా పుట్టుకొచ్చిన కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇందులో భాగంగా... గంటకు సుమారు 20 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న వాటిని కాల్చి బూడిద చేస్తుందని అంటున్నారు. అయితే ఇది ప్రమాదవసాత్తు జరిగింది కాదని.. కావాలనే అడవికి నిప్పు పెట్టడంతో ఇది మొదలైందని సందేహిస్తున్నారు.
ఈ సమయంలో ఓ అనుమానితుడు (42)ని అదుపులోకి తీసుకున్నారు! ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ సుమారు 3,48,000 ఎకరాలను ఈ అగ్ని దహనం చేసిందని అంటున్నారు. దీంతో... సుమారు 2,500 మంది అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ పురోగతి ఏమీ లేదనేది కామెంట్!
వీరితో పాటు 16 హెలీకాప్టర్లు కూడా ఇదే పనిమీద ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో కాల్ ఫైర్ సంస్థ కమాండర్ బిల్లీ సీ మాట్లాడుతు.. ఈ మంటలు గంటకు 5,000 ఎకరాలకు వ్యాపిస్తున్నాయని అన్నారు. తాజాగా అగ్నిమాపక సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. అయినప్పటికీ సిబ్బంది సరిపోవడం లేదని.. విపరీతమైన గాలుల కారణంగా ఈ ప్రయత్నాలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అంటున్నారు.
ప్రధానంగా ఈ ప్రాంతాల్లో గడ్డి ఎక్కువగా పెరగడంతో అగ్నిమాపక దళాలు ముందుకు వెళ్లడం వారికి తలకుమించిన భారం అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఒక్కరోజే సుమారు 1.5 లక్షల ఎకరాలు కాలిపోయాయని ఆయన అంటున్నారు. ఇదే సమయంలో... ఈ ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రం ఎదుర్కొన్న అతిపెద్ద కార్చిచ్చు ఇదే అని అధికారులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో... ప్రస్తుతం వందల సంఖ్యలో కార్చిచ్చులు అమెరికా, కెనడాల్లో వ్యాపించాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ది నేషనల్ ఇంటర్ ఏజెన్సీ ఫైర్ సెంటర్ ప్రస్తుతం అమెరికాలోని పశ్చిమ తీరంలో వ్యాపించిన వందకు పైగా ఉన్న కార్చుచ్చులపై దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాలిఫోర్నియాలోని బుట్టె, టెహమ్మా కౌంటీల్లోని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.