భారత్ పై కెనడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రూడోకి షాక్?
ఈ విషయంలో భారత్ ఏ విషయంలోనూ తగ్గకుండా.. కెనడాకు కౌంటర్స్ ఇస్తూనే ఉంది.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ కారణంటూ కెనడా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో... నాటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అనేక పరిణామాలూ చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో భారత్ ఏ విషయంలోనూ తగ్గకుండా.. కెనడాకు కౌంటర్స్ ఇస్తూనే ఉంది.
నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తాజాగా ట్రూడో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్ పేరును కూడా చేర్చింది. దీంతో... ఇక కెనడా – భారత్ మధ్య దౌత్యపరమైన సంబందాలు పూర్వవైభవం తెచ్చుకునే అవకాశం లేదనే కామెంట్లు వినిపించాయి.
ఇలాంటి గిల్లుడు కార్యక్రమానికి కెనడా తెరతీస్తున్న సమయంలో ఆ దేశ తాజా మాజీ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ జోడీ థామస్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఖలిస్తానీ ఉద్యమ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ నుంచి పూర్తి సహకారం అందుతోందని ఆమె తెలిపారు. శుక్రవారం ఆమె తన పదవి నుంచి రిటైర్ అయ్యిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ పూర్తిగా సహకరిస్తోందని.. అందువల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే అవకాశం ఉందని.. ఆ దిశగానే రెండు దేశాలూ ముందుకు వెళుతున్నాయని.. నిజ్జర్ హత్య కేసులో ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం లోతుగా విచారణ చేస్తోందని వెల్లడించారు. ఇదే సమయంలో... విచారణ సాఫీగా సాగేందుకు భారత్ తమతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.
కాగా... కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే నగరంలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య జరిగగా.. ఈ హత్యకు భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్.ఏ.డబ్ల్యూ) కు చెందిన ఏజెంట్లకు ఉన్న లింకుపై విచారణ చేపట్టామంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.