"ప్రజావేదిక" విషయంలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయం!
రేపు ఐపీఎస్ లతో మీటింగ్ తర్వాత ఈ భవనం ఉండదని.. ఇక్కడ నుంచే అక్రమాల తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించి.. చేసి చూపించారు.
ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం... కరకట్టపై అక్రమంగా నిర్మించారని చెబుతూ ప్రజావేదిక కూల్చివేత. ఐఏఎస్ లతో మీటింగ్ రోజు జగన్ నాడు ఈ ప్రకటన చేశారు. రేపు ఐపీఎస్ లతో మీటింగ్ తర్వాత ఈ భవనం ఉండదని.. ఇక్కడ నుంచే అక్రమాల తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించి.. చేసి చూపించారు.
కట్ చేస్తే... ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో ప్రజావేదిక విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఇది ఒక అక్రమ నిర్మాణం అనే విషయాన్ని జగన్ కన్ఫాం చేసిన అనంతరం... చంద్రబాబు అక్కడే దీన్ని తిరిగి కడతారా.. లేదా అనే విషయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రజావేదిక విషయంలో బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవును... సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావెదికను బుల్ డోజర్లు, ప్రొక్లెయిన్లతో జగన్ కూలగొట్టించిన సంగతి తెలిసిందే. ఈ వేదిక అమరావతి పరిధిలోని చంద్రబాబు నివాసానికి పక్కనే ఉండేది. దీని కూల్చివేత విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు హైకోర్టుకు వెళ్లారు. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్ కొట్టేసిందని వార్తలొచ్చాయి!
అప్పటి నుంచి ఆ శిథిలాలు అలానే ఉండిపోయాయి. ఆ ప్రాంతాన్ని కనీసం శుభ్రం చేసింది కూడా లేదు! ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు శనివారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తున్నప్పుడు ఈ శిథిలాల ప్రస్తావన వచ్చింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... "మేం ఈ శిథిలాలను తొలగించం.. భవిష్యత్తులో కూడా ఈ శిథిలాలు చూస్తే అందరికీ వైసీపీ విధ్వంస పాలన గుర్తుకు రావాలి" అని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఈ ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదని.. కానీ కూల్చేశారని చెప్పారు చంద్రబాబు. ఇదే క్రమంలో... రానున్న రోజుల్లో రాష్ట్ర సచివాలయంలో, రాజధాని ప్రాంతంలో యాక్టివిటీ బాగా పెరుగుతుందని అన్నారు. సచివాలయానికి రాకపోకల కోసం రోడ్లు, రవాణా, ఇతరాత్ర సౌకర్యాలు పెంచుతామని అన్నారు. సామాన్య ప్రజలను కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. భద్రతా నిబంధనలు పాటిస్తూనే సాధ్యమైనంతగా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.