అమెరికాలో అకుల్ మృతికి కారణం ఇదే... ఏమిటీ హైపోథెర్మియా?
అవును... అమెరికాలో భారత సంతతి విద్యార్థి అకుల్ ధావన్ మరణానికి గల కారణాన్ని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఇటీవల కాలంలో విదేశాల్లో.. అందులోనూ ప్రధానంగా అమెరికాలో వరుసగా జరుగుతున్న భారతీయ, భారత సంతతికి చెందిన వ్యక్తుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన భారత సంతతి విద్యార్ధి అకుల్ ధావన్ మృతి కూడా ఒకటి. ఈ సమయంలో తాజాగా అతడి మృతికి గల కారణాలను అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా... అతడి మృతికి హైపోథెర్మియానే కారణం అని తెలిపారు!
అవును... అమెరికాలో భారత సంతతి విద్యార్థి అకుల్ ధావన్ మరణానికి గల కారణాన్ని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఇందులో భాగంగా... హైపోథెర్మియాతోనే అతడు మృతి చెందినట్లు ఇల్లినాయిస్ ఛాంపెయిన్ కౌంటీ కార్నర్స్ ఆఫీస్ ప్రాథమికంగా ధ్రువీకరించింది. ఇదే సమయంలో ఈ అంశంపై మరింత లోతైన విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.
కాగా... జనవరి 20న తన స్నేహితులతో కలిసి క్యాంపస్ కు సమీపంలోనే ఉన్న కెనోపి క్లబ్ కు అకుల్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే... అక్కడి సిబ్బంది వారి ఎంట్రీని నిరాకరించారని వెల్లడించారు. ఈ క్రమంలో క్లబ్ లోనికి వెళ్లడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ.. వారికి అనుమతి లభించలేదని చెప్పారు. ఈ సమయంలో క్యాబ్ బుక్ చేసినా కూడా అక్కడి నుంచి వెళ్లడానికి అతడు నిరాకరించినట్లు చెబుతున్నారు.
ఇలా క్లబ్ లోకి వెళ్లడానికి సిబ్బంది నిరాకరించటంతో అకుల్.. అక్కడ నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. తర్వాత అతని స్నేహితులు కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని అంటున్నారు. దీంతో ఆ ఫ్రెండ్స్ సర్కిల్ లోని ఒకరు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే గాలింపు చేపట్టగా.. కొన్ని గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు.
ఆ సమయంలో అతడిలో హైపోథెర్మియా లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. సాధారణంగా ఇల్లినాయిస్ లో జనవరిలో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయని అధికారులు వెల్లడించారు.
హైపోథెర్మియా అంటే ఏమిటి?
మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కు కాస్త అటూ ఇటు గా ఉంటుంది. చలి ఎక్కువగా ఉన్న సమయంలో... శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచేందుకు ఎక్కువ శక్తిని శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ సమయంలో ఒక నిర్ధేశిత పరిమితికి మించి ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు హైపోథెర్మియా వస్తుంది. ఈ సమయంలో అసలు మద్యం సేవించి ఉండకూడదని వైద్యులు చెబుతుంటారు. మద్యం తీసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందనేది ఒక నమ్మకం మాత్రమే అని చెబుతున్నారు!!