మగాళ్ల హక్కుల కోసం ఓ పార్టీ... మేనిఫెస్టోలో కీలక పాయింట్లు!

వాస్తవానికి ఇది పురుషాధిక్య సమాజం అని అంటూనే... ఈ సమాజం స్త్రీ పక్షపాతి అని చెబుతుంటారు.

Update: 2024-05-16 10:44 GMT

వాస్తవానికి ఇది పురుషాధిక్య సమాజం అని అంటూనే... ఈ సమాజం స్త్రీ పక్షపాతి అని చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి రెండూ సత్య దూరాలే అనేవారూ లేకపోలేదు. ఎవరి స్వీయానుభవం వారిది! అయితే సాధారణంగా రాజకీయ పార్టీలు మహిళల హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం ఎక్కువగా పనిచేస్తున్నట్లు చెబుతుంటాయి. అయితే... తమ పార్టీ మాత్రం పూర్తిగా పురుషుల హక్కులను కాపాడటం కోసమే పుట్టిందని అంటున్నారు "మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (ఎం.ఏ.ఆర్.డీ.)" నేతలు!

అవును... మహిళా హక్కుల పోరాటాల తరహాలోనే పురుషుల హక్కుల కోసం కూడా దేశంలో "మేరా అధికార్ రాష్ట్రీయ దళ్" రాజకీయ పార్టీ పని చేస్తుంది! "మర్ద్ కో దర్ద్ హోతా హై" (పురుషులు కూడా వేదన అనుభవిస్తారు) అనేది ఆ పార్టీ ట్యాగ్‌ ‌ లైన్. డొమెస్టిక్ వయెలెన్స్, వరకట్న నిషేధం, మహిళల రక్షణ చట్టాల్లో లోపాల వల్ల మగవాళ్లు చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారనేది ఈ పార్టీ ప్రధాన ప్రచార నినాదంగా ఉంటుంది!

ఈ సందర్భంగా స్పందించిన ఆ పార్టీ వ్యవస్థాప సభ్యుడు, పార్టీ అధ్యక్షుడు కపిల్ మోహన్ చౌదరి... 2009లో ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. తాను 1999 నుంచి వరకట్న వేధింపుల కేసును ఎదుర్కొంటున్నానని, 25 ఏండ్లుగా అది తేలడంలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తనలా ఇబ్బందులు పడుతున్న చాలా మందిని కలిసి, వారందరితో చర్చించి పార్టీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

ఇదే సమయంలో... పురుషుల హక్కులు, వారి సమస్యలను హైలైట్ చేయడం కోసం 2019 లోక్‌‌ సభ ఎన్నికల్లో వారణాసి, లక్నో నుంచి.. 2020లో బంగార్‌‌ మౌ ఉప ఎన్నిక, బరేలీ, బక్షి కా తలాబ్ (లక్నో), లక్నో నార్త్ లో ఈ ఎం.ఏ.ఆర్.డీ. పార్టీ అభ్యర్థులు పోటీ చేసినట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో.. గోరఖ్‌‌ పూర్, రాంచీ, లక్నోలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు.

ఇక మరిముఖ్యంగా... పార్టీ మేనిఫెస్టోలో భాగంగా... "పురుష సంక్షేమ మంత్రిత్వ శాఖ", "నేషనల్ కమిషన్ ఫర్ మెన్"వంటి హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా... మహిళల రక్షణ కోసం చేసిన చట్టాల వల్ల పురుషులకు అన్యాయం జరగొద్దనేది తమ ఉద్దేశ్యమని కపిల్ చెప్తున్నారు. తమ పార్టీలో మహిళలు కూడా ఉన్నారని.. పురుషుల హక్కులను పరిరక్షించడమే తప్ప మహిళల హక్కులకు భంగం కలిగించడం తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు!

Tags:    

Similar News