తెలంగాణపై పవన్‌కు ఆశల్లేవా....!
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మూడు నాలుగు మాసాల ముందు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మూడు నాలుగు మాసాల ముందు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకంటే ముందుగానే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని.. 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 22 స్థానాల్లో అయినా.. తమ విజయం ఖాయమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వారాహి వాహనానికి పూజ చేయించిన సమయంలో కొండగట్టు వద్ద చెప్పారు.
అదే సమయంలో ఆయన 17 పార్లమెంటు స్థానాల్లోనూ బలమైన పోటీ ఇస్తామని.. ఒకటి రెండు స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని.. పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇక్కడ పార్టీకి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తానని చెప్పారు. అయితే. నెలలు గడిచిపోయినా.. మరో వైపు అసెంబ్లీ ఎన్నికలకు తెలం గాణ సమాజం సిద్ధమవుతున్నా.. ఎక్కడా కూడా పవన్ ఎన్నికల జడి.. కనిపించడం లేదు. వినిపించడం లేదు.
కేవలం ఏపీపైనే పవన్ తన దృష్టిని నిమగ్నం చేశారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుం దా? చేయడం లేదా? అనే టాక్ వినిపిస్తోంది. అయితే.. అంతర్గతంగా విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటంటే.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టు పవన్ వ్యవహరిస్తారని.. కేసీఆర్ కు సెగ తగులుతుందని భావిస్తే.. వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు.. పవన్‌ను రంగంలోకి దింపుతారని ఓ వర్గం నాయకులు చెబుతున్నారు.
ఇక, తమకు వ్యతిరేకత పెద్దగా లేదని.. ప్రభుత్వ పథకాలు, ఉచితాలపై ప్రజలు సానుకూలంగానే ఉన్నార ని కేసీఆర్ భావిస్తే.. చిన్నా చితకా పార్టీలను పక్కన పెడతారని అంటున్నారు పరిశీలకులు. ఈ వ్యూహంలో భాగంగానే పవన్.. తెలంగాణకు దూరంగా ఉంటున్నారని.. అయితే.. ఏపీలో చేస్తున్న ప్రసంగాల్లో మాత్రం తెలంగాణకు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారని చెబుతున్నారు. తద్వారా.. ఎప్పుడైనా అక్కడ అవసరాన్ని బట్టి.. దూకుడు పెంచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.