ప్రేమన్న గులాబీ విద్యార్థి నేత పెళ్లికి నో అనటంతో ఆత్మహత్య!

సోమవారం సాయంత్రం శ్రీనాథ్ తో సాయి స్నేహిత ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడింది. అనంతరం ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

Update: 2024-12-04 05:43 GMT

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన 21 ఏళ్ల సాయి స్నేహిత సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో షాకింగ్ గా మారింది. దీనికి కారణం.. ఆ పార్టీకి చెందిన విద్యార్థి నేత తీరుతోనే సాయి స్నేహిత ఆత్మహత్య చేసుకున్న ఆరోపణలు బలంగా వినిపించటమే. ఈ నేపథ్యంలో పార్టీ స్పందించి.. అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే..

బెల్లంపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడు ఈదునూరి శ్రీనాథ్.. జంగంపల్లి సాయి స్నేహితులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని ఆమె అడగ్గా.. కుల ప్రస్తావన తెస్తూ పెళ్లికి నో చెబుతున్నాడు. దీంతో.. వీరిద్దరి మధ్య వాదనలు జరుగుతున్నాయి.

సోమవారం సాయంత్రం శ్రీనాథ్ తో సాయి స్నేహిత ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడింది. అనంతరం ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇంట్లో ఉన్న ఆమె సోదరి తలుపు తట్టినా తియ్యలేదు. కాసేపటికి శ్రీనాథ్ రావటం.. ఇద్దరు కలిసి బలవంతంగా తలుపులు తెరిచారు. అప్పటికే సాయి స్నేహిత చున్నీతో ఉరి వేసుకొని ఉంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను చూసిన శ్రీనాథ్ అక్కడి నుంచి పారిపోయాడు.

కుటుంబ సభ్యులు ఆమెను తొలుత బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె పరిస్థితి విషమించటంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి వేళ మరణించింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తో శ్రీనాథ్ మీద కేసు నమోదు చేశారు. అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీనాథ్ ను పార్టీ నుంచి తొలగించినట్లుగా జిల్లా అధ్యక్షుడు వెల్లడించారు. ప్రేమించేటప్పుడు కనిపించని కులం.. పెళ్లి టైంలో కనిపించటం ఏమిటో? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News