కవితకు 30 గంటల పరీక్ష

Update: 2019-04-14 05:41 GMT
రైతుల నిరసనతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నిక ఫలితం అంత ఈజీగా తేలదని అర్థమైంది. తమ పంటలకు మద్దతు ధరను కల్పించడం లేదని నిజామాబాద్ పార్లమెంట్ పై 178మంది రైతులు నామినేషన్లు వేశారు.  వీరేకాకుండా ప్రధాన రాజకీయ పార్టీలతో కలిసి 185మంది అభ్యర్థులు అయ్యారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 12 ఈవీఎంలను ఒక్కో పోలింగ్ కేంద్రంలో పెట్టి ఓటింగ్ నిర్వహించారు.

ఇక దేశవ్యాప్తంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. నిజామాబాద్ పార్లమెంట్ పై మాత్రం ఆ మరుసటి రోజు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు దాదాపు 30 గంటల సమయం పట్టే అవకాశముందని అధికారులు తేల్చారు.

నిజామాబాద్ పార్లమెంట్ లో మొత్తం 1788 పోలింగ్ బూత్ లలో పోలైన ఓట్లను రెండు జిల్లా కేంద్రాల్లో లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. జగిత్యాల - కోరుట్ల అసెంబ్లీ పరిధిలోని ఈవీఎంలను జగిత్యాల జిల్లా కేంద్రంలో.. నిజామాబాద్ లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను డిచ్ పల్లిలోని కౌంటింగ్ సెంటర్ లో లెక్కించనున్నారు.

ఒక్కో రౌండ్ లో 18 టేబుళ్లపై 216 బ్యాలెట్ యూనిట్లు ఉంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్క తేలాలంటే నోటాతో కలిసి 186 గుర్తులను నొక్కేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుందని అధికారులు తేల్చారు.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1788 పోలింగ్ స్టేషన్ల ఓట్లు లెక్కింపునకు 15 రౌండ్లు పట్టే అవకాశముంది. రెండు కౌంటింగ్ సెంటర్లలో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను క్రోడీకరించి ఒక్కో రౌండ్ వారీగా ఫలితం వెల్లడించేందుకు రెండుగంటల సమయం పడుతుంది. ఇలా 15 సార్లు జరగాల్సి ఉండడంతో నిజామాబాద్ ఫలితం తేలేందుకు దాదాపు 30 గంటల సమయం పట్టనుంది. దీంతో నిజామాబాద్ విజేత ఎవరో తేలాలంటే మరుసటి రోజు వరకూ ఆగాల్సిందే..
   

Tags:    

Similar News