ప్ర‌త్యేక హోదా రాదు..రైల్వే జోనూ లేదు

Update: 2015-09-06 10:34 GMT
ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు క‌లేనా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. రాష్ర్ట విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వ‌రాల్లో విశాఖ‌ను ప్ర‌త్యేక రైల్వే జోన్‌ గా ప్ర‌క‌టిస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో పాటు ఎన్నిక‌ల ముందు బీజేపీ ప్ర‌భుత్వం కూడా హామీ ఇచ్చింది. దీంతో ఇక్క‌డ రైల్వే జోన్ ఏర్పాటైతే ఏపీకి మ‌రింత ఆదాయం వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశించారు. మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఈ అంశం అతీగ‌తీ లేకుండా పోయింది.

ఈ రోజు ఇదే అంశంపై విశాఖ‌ప‌ట్నంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ విశాఖ‌లో రైల్వేజోన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామ‌న్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ కూడా పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇక ఇదే అంశంపై ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖా మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పారు. రాజ్యంగా స‌వ‌ర‌ణ జ‌రిగితే గాని ఇక్క‌డ రైల్వేజోన్ ఏర్పాటు చేయ‌డం క‌ష్ట‌మ‌ని ఆయ‌న త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. విభజన బిల్లులో స్పష్టత లేకే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆధునిక విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.... కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ చేస్తామని తెలిపారు. అశోక్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఏపీకి రైల్వేజోన్ క‌ష్ట‌మే అని తేలిపోయింది.

నిన్న‌టి వ‌ర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని ఎంతో ఆశించిన ప్ర‌జ‌ల‌కు కేంద్ర చెవిలో పువ్వులు పెట్టింది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు చంద్ర‌బాబు అండ్ కో గ్యాంగ్ ప్రత్యేక ప్యాకేజీ మాట‌ను ప‌దే ప‌దే చెపుతూ కాలం గ‌డుపుతున్నారు. ఇప్పుడు క‌నీసం విశాఖ‌కు రైల్వే డివిజ‌న్ విష‌యంలో కూడా రాజ్యాంగ స‌వ‌ర‌ణ అంటే అది కూడా క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఈ విష‌యం ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా , రైల్వే డివిజ‌న్ రెండూ వ‌చ్చాయంటే అది మ‌రో వింతే అయ్యేట‌ట్టు ఉంది.
Tags:    

Similar News