ఉత్తరాంధ్రుల కడపు మండేలా బాబు చేస్తారా?

Update: 2016-09-07 17:00 GMT
ఊహించని ప్రమాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొంచి ఉందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తర్జన భర్జనల అనంతరం తాజాగా ఏపీకి హోదా కాదు.. ప్రత్యేక ప్యాకేజీ అన్న మాట తెరపైకి రావటం.. ఈ అంశంపై నిన్నటి (మంగళవారం) నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఒడిశా.. చత్తీస్ గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ప్రతిపాదనను విరమించుకొని.. అందుకు భిన్నంగా విజయవాడకు రైల్వే జోన్ కేటాయించే అవకాశం ఉందన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఏపీలో కొత్త చిచ్చు తెచ్చేలా ఉంది. విశాఖకు రైల్వే జోన్ అన్నది ఈ నాటి డిమాండ్ కాదు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలన్న మాట సీమాంధ్రులంతా డిమాండ్ చేస్తున్నా.. ఇప్పుడు అందుకు భిన్నంగా విజయవాడకు తరలిస్తూ కేంద్రంనిర్ణయం తీసుకుంటే.. ఉత్తరాంధ్రుల కడుపు మండటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే రైల్వే జోన్ విశాఖకు వస్తుందా? బెజవాడకు వస్తుందా? అన్న సందేహానికి సమాధానం రాని నేపథ్యంలో ఈ వ్యవహారం ఏపీ అధికారపక్షం నేతల్లో భిన్నవాదనలకు కారణంగా మారింది. ఏపీకి రైల్వే జోన్ కేటాయించటం ఖాయమని.. అయితే అది విశాఖకా? విజయవాడకా? అన్నది తనకు తెలీదని చెప్పుకొచ్చారు ఎంపీ అవంతి శ్రీనివాస్. రైల్వే జోన్ ఖాయమని.. అయితే.. అది విజయవాడలోనా? విశాఖపట్టణంలోనా? అన్నది తేలాల్సి ఉందన్నారు. విశాఖ వాసిగా తాను వైజాగ్ లోనూ రైల్వేజోన్ ఉండాలని కోరుకుంటానని స్పష్టం చేశారు.

ఏపీరైల్వే జోన్ విశాఖ వాసుల హక్కుగా  ఉన్న నినాదాన్ని మీడియా ప్రస్తావిస్తే అందుకు స్పందించిన అవంతి.. ‘‘ఏం విజయవాడ ఏమీ ఏపీలో భాగం కాదా?’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. మరో ఎంపీ కమ్ బీజేపీ నేత కంభంపాటి హరిబాబు రైల్వే జోన్ గురించి స్పందించారు. ఏపీకి రైల్వే జోన్ రావటం ఖాయమన్న ఆయన.. అయితే అది విశాఖలోనా? బెజవాడలోనా? అన్నది తేలాల్సి ఉందన్నారు. విశాఖకే రైల్వే జోన్ వస్తుందని భావిస్తున్నట్లుగా చెప్పిన హరిబాబు.. ఒకవేళ విశాఖకు కాకుండా విజయవాడకు కానీ రైల్వేజోన్ ను ఇస్తే ఈ ఇష్యూలో విశాఖఓడినట్లుగా భావిస్తానని వ్యాఖ్యానించారు.  అయితే.. రాష్ట్రానికి న్యాయం జరగటమే తనకు కావాల్సిందని చెప్పుకొచ్చారు హరిబాబు. నేతల మాటలే ఇంత ఘాటుగా ఉంటే.. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల సెంటిమెంట్లు మరింత తీవ్రంగా ఉంటాయన్న భావన ఉంది. రైల్వేజోన్ విషయంలో విశాఖ కాదంటే మాత్రం ఉత్తరాంధ్రుల మనసులు తీవ్రంగా గాయపడటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News