మెగాస్టార్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి కోసం ఆ పార్టీకి చెందిన మహిళా నేత తన పదవి త్యాగం చేశారు. త్వరలో ఎంపీ పదవి ముగియబోతున్నందున మెగాస్టార్‌కు తిరిగి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆ మహిళా నాయకురాలు ఎవరు? అని ఆశ్చర్యపోకండి...ఆ ఆఫర్ ఇచ్చింది ఎంపీ పదవి కోసం కాదు..కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీ పదవి గురించి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా చిరంజీవి ఎంపికయ్యేందుకు చోటు ఇచ్చింది ఓ మహిళా నేత. పైగా చిరంజీవి తనకు పదవి కావాలని కోరడం ఆసక్తికరం.
ఈనెల పదో తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికకు ముందుగా జిల్లా అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి కమిటీ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతగా ఉన్న చిరంజీవి తన సొంత జిల్లా పశ్చిమగోదావరి నుంచి పీసీసీ సభ్యుడిగా ఎన్నిక కావాలని భావించారు. ఈ విషయాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వివరించారు. అయితే అప్పటికే పశ్చిమగోదావరి జిల్లా కమిటీ పూర్తయింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరగా...కొవ్వూరు బ్లాక్ 1 నుంచి పీసీసీ సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అమరజహా బేగ్ నియమించాలని నిర్ణయించారు. కానీ చిరంజీవి కోరికను సాక్షాత్తు పీసీసీ చీఫ్ వెళ్లడించడంతో ఆమె తప్పుకున్నారు. చిరంజీవి నాయకత్వం పట్ల అత్యంత విశ్వాసంతో కొవ్వూరు నుంచి ఆయనను పిసిసి సభ్యుడిగా నియామకం జరిగేలా తన కోడలు అమరజహా తప్పుకున్నారని పీసీసీ జిల్లా అధ్యక్షులు రఫీ ఉల్లా బేగ్ సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు చిరంజీవి తన పదవి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలను కోరడం ఆసక్తికరంగా మారింది. గత కొద్దికాలంగా ఆయన కాంగ్రెస్‌ను వీడనున్నారనే ప్రచారానికి చెక్ పెట్టినట్లయిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించేందుకు ఆయన సిద్ధమయ్యారని అంటున్నారు.