క‌ర్ణాట‌క రాజ‌కీయం హైద‌రాబాద్ కు షిప్ట్‌?

Update: 2018-05-17 04:20 GMT
క‌ర్ణాట‌క రాజ‌కీయం అంత‌కంత‌కూ ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఎన్నిక‌ల్లో ఏపార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం రాక‌పోవటం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ త‌న‌కున్న విచ‌క్ష‌ణ అధికారంతో బీజేపీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ లేఖ రాశారు. దీనికి స్పంద‌న‌గా య‌డ్డీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అదే స‌మ‌యంలో 15 రోజుల వ్య‌వ‌ధిలో య‌డ్యూర‌ప్ప అసెంబ్లీలో త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించుకోవాల్సి ఉంటుంది. దీంతో.. ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేతిలోకి తీసుకున్న నాటి నుంచి క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే.. య‌డ్డీ బ‌లాన్ని నిరూపించేందుకు వీలుగా.. విప‌క్ష ఎమ్మెల్యేల‌పై దృష్టి సారించే వీలుంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌.. జేడీఎస్ పార్టీలు త‌మ ఎమ్మెల్యేల్ని రిసార్టుల‌కు త‌ర‌లించిన వైనం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగ‌ళూరు బ‌య‌ట ఉన్న ఈగిల్ట‌న్ రిసార్ట్ లో ఉండ‌గా.. జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను బెంగ‌ళూరు న‌గ‌రంలోని షాంగ్రిలా హోట‌ల్లో ఉంచారు. య‌డ్డీ నేతృత్వంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేల బేర‌సారాల‌కు అవ‌కాశం లేకుండా ఉండేందుకు వీలుగా.. హైద‌రాబాద్‌ కు త‌మ ఎమ్మెల్యేల్ని త‌ర‌లించాల‌ని కాంగ్రెస్‌.. జేడీఎస్ లు భావిస్తున్నాయి.

మ‌రోవైపు.. య‌డ్డీ చేతికి రాజ్యాధికారం వ‌చ్చిన వెంట‌నే కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల మీద ఐటీ దాడులు చేయించే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉంచితే దాడులు జ‌రిగే వీలుంద‌ని.. అందుకే ప్ర‌స్తుతానికి వేరే రాష్ట్రానికి త‌ర‌లించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏ ర‌కంగా చూసినా.. హైద‌రాబాద్ అయితే త‌మ‌కు సేఫ్ అన్న భావ‌న‌లో కాంగ్రెస్‌.. జేడీఎస్ లు ఉన్నాయి. దీంతో.. ఈ రెండు పార్టీల క్యాంపులు హైద‌రాబాద్ కు మార‌నున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News