కరోనా వాస్తవాల గురించి చెబితే ప్రజల భయపడతారా?

Update: 2021-05-20 05:30 GMT
వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం అడ్డదిడ్డమైన వాదనను తెర మీదకు తీసుకురావటం.. దానికి కాస్తంత మసాలా జోడించి చిన్న చిన్న వీడియోలుగా చేసి జనం మీదకు వదలటం ఈ మధ్యన అలవాటుగా మారింది. ఎవరికి వారు వారికి సంబంధించిన సానుకూల వాదనను వినిపించటం ఎక్కువైంది. దీంతో.. ప్రజల్లో ఒకలాంటి కన్ఫ్యూజన్ కు కారణమవుతోంది. తమకు నచ్చని వారిని ఏదో ఒక ముద్ర వేసేయటం ఈ మధ్యన వచ్చిన మరో దురలవాటు. కరోనా మహమ్మారికి సంబంధించి వాస్తవాల్ని భయపెట్టేలా చెబుతూ.. ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ ప్రభుత్వాలు కొన్ని వినిపిస్తున్న చెత్త వాదనకు ఇకనైనా పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.

కరోనా సెకండ్ వేవ్ ఇంతలా విరుచుకుపడటానికి ఒక చెత్త వాదన కూడా కారణమన్న మాట నిపుణుల నోట ఇప్పుడు వినిపిస్తోంది. వాస్తవాల్ని వెల్లడిస్తే.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతారంటూ.. యాభై మరణాలకు ఐదు మరణాల్ని చూపించటం.. వెయ్యి కేసులకు రెండు వందల కేసులే అంటూ బుకాయించటం ప్రజల్లో మహమ్మారి తీవ్రత పట్ల అవగాహన లేకుండా పోయింది. ప్రజలు అప్రమత్తతో వ్యవహరించే అవకాశం చేజారింది. సెకండ్ వేవ్ తీవ్రతకు ఇదో కారణంగా చెప్పక తప్పదు.

కరోనా కేసులు కానీ.. మరణాలు కానీ ఉన్నవి ఉన్నట్లుగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదన ఉంది. ప్రాశ్చాత్య దేశాలు వాస్తవాల్ని వెల్లడించేందుకు మొగ్గు చూపుతాయి. అదేమీ తమ వైఫల్యంగా భావించవు. కేసుల తీవ్రతను చెప్పటం ద్వారా.. ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసుకొని.. మరింత జాగ్రత్తగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇందుకు భిన్నంగా మన దేశంలోని కొందరు పాలకులు మాత్రం.. జనాల్ని భయపెట్టి చంపేస్తారా? అంటూ తీవ్రతను తగ్గించి చెప్పే పద్దతికి తెర తీశారు.

అందుకు అందమైన వాదనను వినిపించారు. వాస్తవాల్ని చెప్పే వారిని ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణల మరకలు వేశారు.  మరణాల గురించి చెలరేగిపోయి చెబుతూ శవానందానికి గురవుతున్నారంటూ ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేశారు. నిజంగానే ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీయటానికి మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానం.. ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న భావన ప్రజల్లో ఉండటం.. కరోనాను పెద్దగా పట్టించుకోకపోవటం సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమైంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. చెత్త వాదనను కట్టి పెట్టి.. ఉన్న వాస్తవాల్ని అవెంత చేదుగా ఉన్నప్పటికి ప్రజలకు చేరవేయటం ద్వారా కరోనా కట్టడికి అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News