క‌ర్నూలులో బాబుకు షాక్ త‌ప్ప‌దా?

Update: 2017-03-15 05:57 GMT
ఏపీలో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పూర్తి కాగా... స‌భ‌లో ఉన్న అధికార టీడీపీకి ఉన్న బ‌లం ఆధారంగా ఆ పార్టీ ఐదు స్థానాలను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునే సంపూర్ణ బ‌లంతో పాటు మ‌రో అభ్య‌ర్థి విజ‌యం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల‌కు సంబంధించి మూడు - నాలుగు ఓట్లు త‌క్కువ ఉన్నా... విప‌క్ష వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో వైసీపీ ఖాతాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ప‌డిపోయాయి. ఇటీవ‌లే టీచ‌ర్‌ - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇక మిగిలింద‌ల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లే మిగిలాయి. ఈ మూడు కేట‌గిరీల‌కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లే కీల‌క‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కేవలం ఆ పార్టీకి స‌భ‌లో ఉన్న స‌భ్యుల సంఖ్యాబ‌ల‌మే నిర్ణ‌య‌మ‌వుతాయి. అదే స‌మ‌యంలో టీచ‌ర్‌ - గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయం అంత‌గా ఉండ‌ద‌నే చెప్పాలి.

ఇక స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే... ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల ఓట్లే ఆధారంగా ఈ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అధికార పార్టీకి అసెంబ్లీలో బ‌లం ఉన్నా... విప‌క్షానికి జిల్లాల్లోని స్థానిక సంస్థ‌ల్లో బ‌లం ఉంటే... స‌మీక‌ర‌ణాలు ఆస‌క్తిక‌రంగానే ఉంటాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల‌కు సంబంధించి విప‌క్ష వైసీపీకి ప‌లు  జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల్లో మెజారిటీ స‌భ్యులున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి అటు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌తో పాటు... ఆ పార్టీకి కంచుకోట‌గా ఉన్న క‌ర్నూలు జిల్లాలోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు టీడీపీ య‌త్నిస్తుండ‌గా, త‌న స‌భ్యుల‌ను  టీడీపీలోకి వెళ్ల‌కుండా చూసుకునేందుకు వైసీపీ కూడా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో క‌ర్నూలు జిల్లాలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంది.

వైసీపీకి స్ప‌ష్ట‌మైన బ‌ల‌మున్నా... అక్క‌డ గెలిచి తీరాల్సిందేన‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న పార్టీ నేత‌ల‌కు హుకుం జారీ చేశారు. అధినేత నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో క‌ర్నూలు జిల్లా తెలుగు త‌మ్ముళ్లు విభేదాల‌ను ప‌క్క‌న‌బెట్టి మ‌రీ ప్ర‌చారం చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మ పార్టీ వైపు వ‌చ్చే వైసీపీ ప్ర‌తినిధులు ఎవ‌రైనా ఉన్నారా? అన్న దిశ‌గా ఆ పార్టీ నేత‌లు చాలా ఆత్రుత‌గా ఎదురుచూడ‌ట‌మే కాకుండా... ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోరాద‌న్న త‌లంపుతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీకి షాకిచ్చే ఓ ఘ‌ట‌న నిన్న చోటుచేసుకుంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా... స్థానిక సంస్థ‌ల్లో మాత్రం అక్క‌డ‌క్క‌డా విజ‌యం సాధించింది. అయితే ఆ పార్టీ అభ్య‌ర్థి ప్ర‌స్తుత ఎమ్మెల్సీ బ‌రిలో లేరు. మ‌రి వారి ఓట్లు ఎవ‌రి ఖాతాలోకి వెళ‌తాయి? అన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఈ విష‌యాన్ని అధికార టీడీపీ కంటే కూడా కాస్తంత ముందుగా స్పందించిన వైసీపీ నిన్న ఓ కీల‌క అడుగు వేసింది.

క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి... అనంత‌పురం మాజీ ఎంపీ - పార్టీ సీనియ‌ర్ నేత అనంతవెంక‌ట్రామిరెడ్డిని వెంట‌బెట్టుకుని మ‌రీ... కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వ‌ద్ద‌కు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల ఓట్లు త‌మ‌కు వేయించాల‌ని కోట్ల‌ను గౌరు అభ‌ర్థించారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై అక్క‌డిక‌క్క‌డే ఆలోచించిన కోట్ల‌... మ‌ద్ద‌తిచ్చేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. భేటీ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన కోట్ల... మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అరాచ‌క పాల‌న సాగిస్తోంద‌ని ఆరోపించారు. టీడీపీ అరాచ‌క పాల‌న‌కు చెక్ పెట్టడం కోస‌మే... తాము ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్నామ‌ని, త‌మ పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు వైసీపీ అభ్య‌ర్థి గౌరు వెంక‌ట‌రెడ్డికి ఓటేస్తార‌ని చెప్పారు. ఈ ప‌రిణామంతో వైసీపీకి మ‌రింత బ‌లం పెర‌గ‌గా, గెలుపుపై ధీమాతో ముందుకు వెళుతున్న టీడీపీకి మాత్రం పెద్ద షాకే ఇచ్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News