మ‌ళ్లీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ప్ప‌దా?

Update: 2022-09-16 04:51 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ప్ప‌దా? అంటే అవున‌నే చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా అసెంబ్లీ లాబీల్లో దీనిపైనే చ‌ర్చ న‌డిచింద‌ని చెబుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో నేత‌లంతా ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లపై చర్చించార‌ని టాక్ న‌డుస్తోంది.

ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ కేబినెట్ భేటీలో కొంత‌మంది మంత్రుల‌కు క్లాస్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై స‌రిగా స్పందించ‌డం లేద‌ని.. త‌న‌పైన‌, త‌న స‌తీమ‌ణిపైన విమ‌ర్శ‌లు చేస్తున్నా ఏం ప‌ట్ట‌న‌ట్టు ఉంటున్నార‌ని మండిప‌డ్డ‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఒక మ‌హిళా మంత్రితోపాటు మ‌రో ముగ్గురు మంత్రులు నామ్‌కే వాస్తే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు చెప్పుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడున్న మంత్రుల్లో న‌లుగురిని త‌ప్పించి కొత్త‌వారిని, ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డేవారిని ఆ న‌లుగురి స్థానాల్లో తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వీరే ఆ న‌లుగురు అంటూ కొన్ని పేర్లు కూడా హ‌ల్‌చ‌ల్ చేశాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా సీఎం జ‌గ‌న్ ముందుకు వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ఆయ‌న మంత్రుల‌కు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. 175కి 175 సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో ఉన్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం పేరుతో ప్ర‌తి ఇంటికీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు వెళ్తున్నారు. మ‌రోవైపు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేల‌పైనా జ‌గ‌న్ ఆధార‌ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వాన్ని మ‌రింత దూకుడుగా న‌డిపించ‌డంతోపాటు, కొత్త‌గా మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను చేప‌ట్టాల‌నే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ని అంటున్నారు. ఇందుకు స‌మ‌ర్థులైన మంత్రులు ఉంటే త‌న ప‌ని తేలిక‌వుతుంద‌నే భావ‌న‌లో ఆయ‌న ఉన్నార‌ని చెబుతున్నారు. ఓవైపు ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం, మ‌రోవైపు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి విస్తృతంగా చెప్ప‌గ‌లిగే మంత్రులు ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గంలో మ‌రోమారు స్వ‌ల్ప మార్పులు జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని పేర్కొంటున్నారు.

ప్ర‌శాంత్ కిషోర్ కూడా కొంత‌మంది మంత్రుల‌ను మారిస్తే మంచిద‌ని చెప్పిన‌ట్టు ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శాంత్ కిశోర్ ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు ఇస్తున్నార‌ని అంటున్నారు. ఒక‌వేళ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే బూతు మంత్రులుగా పేరుగాంచిన పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌ల‌కు మ‌ళ్లీ చాన్స్ ద‌క్కుతుంద‌ని చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News