ఇక కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ ములాఖ‌త్.. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు గ్ర‌హిస్తారా?

Update: 2022-08-03 06:29 GMT
వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోమారు ముఖ్య‌మంత్రి కావాల‌ని వైఎస్సార్సీపీ అధినేత జ‌గ‌న్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో ఎమ్మెల్యేల‌ను, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జుల‌ను ఇంటి ఇంటికీ తిప్పుతున్నారు. మ‌రోవైపు వివిధ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్క‌డానికి తాను కూడా ఆయా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

అయితే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు వైఎస్సార్సీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గెలిచిన మూడేళ్ల త‌ర్వాత తాము గుర్తొచ్చామా అని నేత‌ల‌ను నిల‌దీస్తున్నారు. త‌మ‌కు ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని, ఇళ్లు రాలేద‌ని.. రోడ్లు బాలేద‌ని ఇలా అనేక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు గ‌ళ‌మెత్తుతున్నారు. వీటికి స‌మాధానం చెప్ప‌లేక‌.. ప్ర‌శ్నించిన‌వారిని పోలీసుల‌తో అరెస్టు చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ కానుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆగ‌స్టు 4, గురువారం నుంచి సీఎం జ‌గ‌న్ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 50 మంది కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ‌నున్నారు.

ముందుగా టీడీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ భేటీ కానున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ సూచించిన‌వారితోపాటు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిశోర్ బృందం సూచించిన కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ భేటీ అవుతారు.

ఇలా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపిక చేసిన 50 మంది క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ భేటీ కానున్నార‌ని చెబుతున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం ఆశించినంత స‌క్సెస్ కాక‌పోవ‌డం, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త వంటివి ఎందుకు జ‌రుగుతున్నాయో జ‌గ‌న్ తెలుసుకోనున్నారు. అలాగే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా? లేదా? ప‌రిస్థితి స‌వ్యంగానే ఉందా? లేదా? ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఇలా అన్ని అంశాల‌ను కార్యక‌ర్త‌ల నుంచి జ‌గ‌న్ తెలుసుకుంటార‌ని అంటున్నారు.

ఇప్ప‌టిదాకా అంతా స‌వ్యంగానే ఉంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 అని భావిస్తున్న జ‌గ‌న్ కు కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడితే కానీ అస‌లు వాస్త‌వాలేవో తెలియ‌ద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News