వస్తున్నాడు.. ఆ కాంగ్రెస్ సీనియర్ వారసుడు

Update: 2023-03-31 23:00 GMT
ఆయనది ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం. దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన రికార్డు. ఈ రికార్డు కూడా ఎవరూ సాధించలేనంతటిది. ఆ నియోజకవర్గంపై చెరగని ముద్ర. కొత్త పేరుతో నియోజకవర్గంగా ఏర్పడినా బలమైన పట్టు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితులు మారిపోయాయి. ఆయన ప్రభావం తగ్గిపోయింది. వయో భారంతో క్రియాశీల రాజకీయాలు కష్టమయ్యాయి. పార్టీ కార్యక్రమాల్లోనే తప్ప ప్రజా క్షేత్రంలో క్రియాశీలత తగ్గింది. దీంతో చాలాకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు రాజకీయ వారసుడిగా వస్తారని ప్రకటించారు.

చలకుర్తి నుంచి సాగర్ దాకా

తెలంగాణ కాంగ్రెస్ లోనే కాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా కందూరు జానారెడ్డిది రాజకీయంగా చాలా కీలకపాత్ర. పెద్దన్న తరహాలో జానారెడ్డిని చూసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జానారెడ్డి హోం మంత్రి. అప్పట్లో పరిటాల రవి దారుణ హత్య, వరుస ఎన్ కౌంటర్లు, బాంబు పేలుళ్లు వంటి ఇతర కీలక పరిణామాలకు జానారెడ్డి సాక్షి. ఓ విధంగా నాడు బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ.. వైఎస్ ను వదిలి జానారెడ్డిని టార్గెట్ చేసేది.

అయితే, ఆయన నిబ్బరంగా గుంభనంగా ఉంటూ అన్నిటినీ ఎదుర్కొనేవారు. అలా పార్టీని, ప్రభుత్వాన్ని సమస్యల నుంచి ఒడ్డున పడేసేవారు. 2004 వరకు చలకుర్తి ఎమ్మెల్యేగా జానారెడ్డి వరుసగా గెలిచారు. 2009లో ఆ నియోజకవర్గం రద్దయి నాగార్జున సాగర్ పేరిట కొత్త నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచే జానారెడ్డి రాజకీయ జీవితం కాస్త వెనుకబడింది.

గెలిచినా మంత్రి పదవి రాక.. అధికారానికి దూరమై

2009తో సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచినా వైఎస్ మంత్రి వర్గంలో చాన్స రాలేదు. ఈ పరిణామం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే సమయలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ మంత్రిగా చాన్సిచ్చారు. ఇక తెలంగాణ వచ్చాక 2014లో జానారెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 2018లో నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమిపాలయ్యారు.

కానీ, నర్సింహయ్య అకాల మరణంతో 2021లో వచ్చిన ఉప ఎన్నికలో జానారెడ్డి బరిలో దిగినా గెలవలేకపోయారు. అప్పటికే 70 ఏళ్లు దాటిన జానా.. తన వయసులో సగం కూడాలేని నర్సింహయ్య కుమారుడు భగత్ చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతోనే జానా క్రియాశీల రాజకీయాలకు ఆ ఎన్నికలు ఆఖరు అని కథనాలు వచ్చాయి.

ఈసారి బరిలో ఆయన కుమారుడు

రాబోయే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని జానారెడ్డి స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి 2023లో బరిలో ఉండడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. పైగా రఘువీర్ యువకుడు. నియోజకవర్గాన్ని ఎన్నో ఏళ్లుగా చూస్తున్నారు. తండ్రి జానా మార్గదర్శకత్వంలో ఆయన ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. తద్వారా.. జానారెడ్డి నిష్క్రమణతో తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ శకం ముగిసింది. అయిదు దశాబ్దాల ప్రస్థానానికి తెరపడింది. రాజకీయంగా ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా హుందగా స్పందించే జానా నిష్క్రమణ నాటి తరం ఉన్నత రాజకీయాలకు నిదర్శనం.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News