చంద్ర‌బాబును మ‌ళ్లీ కెలికిన టీడీపీ ఎంపీ

Update: 2015-11-09 12:29 GMT
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యా‌‌ఖ్యలు చేశారు. బీహార్ ఫలితాల నుంచి మొద‌లుకొని ఏపీకి ప్ర‌త్యేక హోదా, రాయ‌ల‌సీమ రాష్ర్టం వ‌ర‌కు అన్నివిష‌యాల్లోనూ త‌నదైన శైలిలో స్పందించారు. ఎప్ప‌ట్లాగే ప్ర‌తి విష‌యాన్ని పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా అంట‌గట్టారు.

బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గుణపాఠం నేర్పించాయని జేసీ వ్యాఖ్యానించారు. పాల‌కులు ఎవ‌రైనా...ఈ ఫ‌లితాల ఆధారంగా పాఠం నేర్చుకోవాల‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వ‌ద‌ని జేసీ తేల్చిచెప్పారు. ఈ విష‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స‌హా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రికి కూడా తెలుసని అన్నారు.

రాయ‌ల‌సీమ‌లో బీజేపీ అంటే ఎవ‌రికీ తెలియ‌ద‌ని జేసీ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఏపీలో బీజేపీ అధికారంలోకి రాదని ఆయ‌న జోస్యం చెప్పారు. సీమ‌కు ఇప్ప‌టికీ క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయ‌ని జేసీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న స‌మ‌యంలోనే రాయ‌ల తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చి ఉండేవి కావ‌న్నారు. అందుకే అప్పుడే తాను రాయ‌ల తెలంగాణ డిమాండ్ చేసిన‌ట్లు చెప్పారు.
Tags:    

Similar News