జూ.ఎన్టీఆర్ సీఎం ఫ్లెక్స్.. ఇబ్బందుల్లో టీడీపీ?

Update: 2020-12-29 05:30 GMT
తెలుగుదేశానికి కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబే.. ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ బాబు. అయితే చంద్రబాబులా నాయకత్వ లక్షణాలు లోకేష్ లో లేకపోవడం.. చంద్రబాబుకు వయసు అయిపోవడంతో యువకుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోవడంలో టీడీపీ శక్తి సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు టీడీపీలో మరో కొత్త వాదన తెరపైకి వస్తోందన్న చర్చ సాగుతోంది.

ప్రకాశం జిల్లాలోని యెర్రాగొండపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డు తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టిందన్న చర్చ సాగుతోంది. ఈ ఫ్లెక్స్ లో  “జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ తదుపరి సిఎం. నూతన సంవత్సర శుభాకాంక్షలు."  అని బహిరంగంగా టీడీపీ నేతలే అచ్చు వేయడం సంచలనంగా మారింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా జిల్లాలోని వివిధ టిడిపి నాయకుల ఫొటోలు ఉండడం విశేషం.  

ప్రకాశం జిల్లాలోని టిడిపి నాయకులు.. కేడర్లలో ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ఫ్లెక్స్ బోర్డు చర్చనీయాంశంగా మారింది, అయినప్పటికీ దీన్ని ఎవరు స్పాన్సర్ చేసారో.. ఎవరు ఏర్పాటు చేశారో అన్నది బహిరంగంగా చెప్పడం లేదు.కానీ అది ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిని.. అసమ్మతి గళాలకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చాలా ఇబ్బంది కలిగించింది.

గతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఇలాంటి పోస్టర్లు, ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. టిడిపిలో ఇబ్బందులు సృష్టించడానికి టిడిపి  ప్రత్యర్థులు ఈవిధంగా చేస్తారని ఊహించినప్పటికీ అందులో టీడీపీ నేతల ఫొటోలు కూడా ఉండడంతో అంగీకరించలేని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ ఫొటోను టీడీపీ నేతలు  ఎవరూ దీనిని బహిరంగంగా ఖండించలేదు.

పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో టిడిపి కార్యకర్తలు పూర్తిగా నిరాశ స్థితిలో ఉన్నారు. ఈ ఫ్లెక్సీతో  ఒక విషయం స్పష్టమైంది. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత బలంగా తీసుకోలేకపోయినప్పటికీ, పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వం లేదని దీంతో వెల్లడైంది. అందువల్లనే జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తెచ్చారని అంటున్నారు. టిడిపిలో చురుకైన నేతలను రాజకీయాల్లోకి తీసుకురావాలని  టీడీపీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఇది వచ్చే ఎన్నికలలో కఠినమైన పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ చేయగలదని భావిస్తున్నారు.
Tags:    

Similar News