రైలు ప్రమాదాలన్నీ ఉగ్రవాదుల వల్లేనా?

Update: 2017-02-26 10:57 GMT
దేశంలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.. వీటిలో చాలావరకు ఉగ్రవాదుల కారణంగానే జరుగుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా రైల్వే శాఖ ఈ విషయంలో గట్టి నమ్మకంతో ఉంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన 40 రైలు ప్రమాదాల వెనుక విదేశీ ఉగ్రవాదుల హస్తం ఉందని ఆరోపిస్తూ ఎన్ ఐఏ చేత ప్రత్యేక దర్యాఫ్తు జరిపించాలని రైల్వే శాఖ కోరింది. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
    
గత ఏడాది 150 మందిని బలితీసుకున్న కాన్పూర్ రైలు ప్రమాదానికి కారకుడైన నేపాల్ వాసి, ఐఎస్ ఐఎస్ కోసం పని చేస్తున్నాడన్న విషయం వెల్లడి కావడంతో, కుట్ర కోణంపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి. కొన్ని ప్రమాదాల్లో ఫిష్ ప్లేట్లు తొలగించి వుండటం, పట్టాలపై విడిభాగాలు ఉండటం వంటి సాక్ష్యాలను పరిశీలించిన తరువాత, బాహ్య శక్తుల పాత్రపై రైల్వే శాఖకు అనుమానాలు బలపడ్డాయి.  కాన్పూర్‌ రైలు ప్రమాదంపై పాకిస్తాన్‌ కుట్ర ఉందని ప్రధాని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    
కాగా ఇటీవల ఏపీలో జరిగిన రైలు ప్రమాదంలోనూ ఉగ్రవాద కుట్ర ఉందని రైల్వే శాఖ ఆరోపించినా విచారణలో అదేమీ లేదని తేలింది. కానీ.. రైల్వే శాఖ మాత్రం ఏకంగా 40 ప్రమాదాలకు ఉగ్రవాదులే కారణమని చెబుతుండడం గమనార్హం.  ప్రమాదాలు జరిగిన చాలా ప్రాంతాలు అసలు ఉగ్రవాద జాడలు లేని ప్రాంతాలు. అలాంటప్పుడు అందులో ఉగ్ర కోణం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణకు తీసుకుంటేనే అసలు గుట్టు బయటపడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News