ఆ సీఎంకు ఎంత కష్టం వచ్చిందంటే..

Update: 2016-10-21 05:26 GMT
ఎవరింటికైనా వెళ్లి.. వారి పేరు మర్చిపోతే ఎలా ఉంటుంది? అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. కానీ.. అలాంటి చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. తన చేతలతో వివాదాల్లో చిక్కుకుపోయే ఆయనకు తాజాగా విచిత్రమైన అనుభవం ఎదురైంది. గవర్నర్ అడ్డా అయిన రాజ్ భవన్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిత్రమైన ఇబ్బంది ఎదురైంది. ఆయనకు ఎదురైన ఇబ్బంది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఉత్తమ పోలీస్ అధికారులుగా ఎంపికైన వారికి పతకాలు ప్రదానం చేసే కార్యక్రమం బెంగళూరులోని రాజ్ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎంను ఆహ్వానించారు. అయితే.. తన ప్రసంగంలో ఆ రాష్ట్ర గవర్నర్ పేరును ముఖ్యమంత్రి మర్చిపోయారు. గవర్నర్ పేరును గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేసి తడబడ్డారు. చివరకు ఆహ్వానపత్రిక తెచ్చుకొని.. అందులో ఉన్నపేరును చూసి చదివిన వైనం సీఎంకే కాదు.. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న వారిని ఇబ్బందికి గురి చేసింది.

కర్ణాటక గవర్నర్ గా వాజుభాయ్ వాలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి ప్రధమ పౌరుడిగా ఉండే ఆయన పేరును గుర్తు తెచ్చుకునేందుకు కర్ణాటక సీఎం తెగ కష్టపడ్డారు. పేరును ప్రస్తావించకుండా గవర్నర్ గారూ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసినా.. సాధ్యం కాదన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆహ్వానపత్రికను తెప్పించి.. అందులోని గవర్నర్ పూర్తి పేరును చదివారు. తన ఇంటికి వచ్చి తన పేరునే మర్చిపోయిన సీఎం సిద్ధరామయ్య గురించి గవర్నర్ ఎలా ఫీలై ఉంటారో..?
Tags:    

Similar News