పదేళ్లలో తొలిసారి సెంటిమెంట్ మిస్ చేసిన కేసీఆర్

Update: 2022-08-21 12:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొన్ని విషయాల్లో ఎంతటి పట్టింపులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించాలన్నా.. తన లక్కీ నెంబరు ఆరు వచ్చేలా చూసుకోవటం కూడా ఆయనకు అలవాటు. ఈ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు తెలిసిందే. దీనికి తోడు జాతకాలు.. మంచి చెడ్డలు.. వాస్తు.. సెంటిమెంట్లు.. ఇలాంటి వాటన్నింటికో ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. తొలిసారి తన తీరుకు భిన్నంగా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది.

తమకు సంబంధం లేని అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి తాజాగా మునుగోడు పుణ్యమా అని ఏర్పడింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవటం తెలిసిందే. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళుతూ.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మరికొద్ది నెలల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడులో భారీ సభను నిర్వహించిన కేసీఆర్.. ఈ సభకు బయలుదేరే సమయంలో తన తీరుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.

సాధారణంగా ఆయన ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నా.. ఏదైనా సభకు వెళ్లాలని భావించినా.. ఆయన ప్రగతిభవన్ నుంచి కాకుండా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్లటం ఒక అలవాటు. గడిచిన పదేళ్ల నుంచి ఆయన ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. తాజాగా మునుగోడు సభకు మాత్రం ఆయన మొదటిసారి తన సెంటిమెంట్ కు భిన్నంగా వ్యవహరించారు.

గురువారం ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాత్రి ప్రగతిభవన్ కు వెళ్లి.. శనివారం ఉదయం అక్కడినుంచి మునుగోడుకు బయలుదేరి వెళ్లారు. ఇందుకోసం వేలాది కార్లతో కాన్వాయ్ గా మునుగోడు సభకు వెళ్లటం తెలిసిందే. ఆద్యంతం తన బలాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రయాణం సాగింది. ఏమైనా..పదేళ్ల నుంచి సాగుతున్న సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి.. కొత్త అలవాటును షురూ చేసిన నేపథ్యంలో.. ఏం జరగనుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News