ఇది... కేసీఆర్ ఊహించ‌ని తీర్పు !

Update: 2018-04-17 09:57 GMT
తెలంగాణ సర్కార్‌ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ లకు ఊరట లభించింది. ఇద్దరిపై అసెంబ్లీ బహిష్కరణను హైకోర్టు ఎత్తివేసింది. కోమటిరెడ్డి - సంపత్‌ లను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది. ఇది తెలంగాణ సర్కార్‌ కు - సీఎం కేసీఆర్‌ కు ఎదురు దెబ్బ అని - కోమ‌టిరెడ్డి విజ‌య‌మ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించివేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌ ఫోన్‌ ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌ కుమార్‌ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ వారిపై అసెంబ్లీ బహిష్కరణ విధించారు. ఆ వెంటనే వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది.

అయితే దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలుమార్లు వాదనలు విన్న న్యాయస్థానం కాంగ్రెస్‌ సభ్యులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోలన్నీ రద్దయినట్లేనని కాంగ్రెస్‌ సభ్యుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు. ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం ఇస్తూనే... తమ సభ్యత్వం ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు పురుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్  కుమార్ ల పదవి బహిష్కరణకు కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు హర్షణీయమ‌ని, దీన్ని  స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది ఈ నిరంకుశ  టీఆర్ ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టని ఉత్తమ్ అన్నారు. అప్రజాస్వామిక చర్యలతో ప్రజల, ప్రశ్నించే గొంతులను నులిమి వేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలైందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుందని ప్రజల మద్దతుతో ముందుకు పోతుందని అన్నారు. అధికార దూరహంకారం తో - విచ్చల విడి చేష్టలతో విర్రవీగి పోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్దతిలో పాలన చేయాలని ఉత్తమ్ కోరారు.

కాగా, తాజా తీర్పు నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధిష్టానం స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అప్పీలుకు వెళ్ల‌డ‌మా లేక ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయ‌డ‌మా అనేది గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేతిలో ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే....వ‌దిలివేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌నే భావ‌న‌ పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News