కొడుకు పోయిన దు:ఖంలో ఉన్న మేకపాటి నోట కీలక వ్యాఖ్యలు

Update: 2022-02-28 02:57 GMT
ఇటీవల కాలంలో ఏ రాజకీయ కుటుంబానికి రానంత కష్టం నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటికి వచ్చింది. 77ఏళ్ల పెద్ద వయసులో.. తనను పంపించే బాధ్యత తన కొడుకుదన్న భావనలో ఉన్న వేళలో అనూహ్యంగా కొడుకును తన చేతుల మీదుగా పంపించే పరిస్థితి మరే తండ్రికి రాకూడదు. రాజకీయంగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మేకపాటి కుటుంబానికి తీరని కష్టమే వచ్చిందని చెప్పాలి. తన కుమారుడుకమ్ దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని ఆయన ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.  తాజాగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

దేవుడు తనను చిన్నచూపు చూశాడని.. తన అంతిమ సంస్కారాలు తన కొడుకు చేస్తాడనుకుంటే.. అందుకు భిన్నంగా చిన్న వయసులో ఉన్న తన కొడుకు అంత్యక్రియల్ని చేయాల్సి వచ్చిందన్నారు. కలలో కూడా ఇలాంటిది జరుగుతుందని తాను భావించలేదన్నారు. ఇదే సందర్భంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు.. కంపెనీలను తీసుకురావటం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్ మెంట్ పథంలోకి తీసుకెళ్లాలన్నారు. ఏపీకి విస్తారమైన 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని.. డెవలప్ మెంట్ కు భారీ అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

హైదరాబాద్ డెవలప్ మెంట్ లో సీమాంధ్రుల వాటా చాలా ఎక్కువగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాష్ట్ర రాజధాని పైనా వ్యాఖ్యలు చేశారు. అందరికి అనువుగా.. ఈజీగా యాక్సెస్ చేసే లొకేషన్ లో రాజధాని ఉండాలన్నారు. రాజధాని లాంటి పెద్ద విషయం ముందు.. చిన్న అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజలకు సేవ చేసే అవకాశం వందలాది కోట్లు ఉన్నా చేయలేమని.. ప్రజాసేవతోనే సాధ్యమవుతుందన్నారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన గోదావరి జిల్లాలకు చెందిన ఒక రాజుగారు.. తనను ఓదార్చే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పటికి గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ మీద ఆదరణ తగ్గలేదని.. ఇప్పటికి ఆయన హవా నడుస్తూనే ఉందన్నట్లుగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తన కుమారుడు పేరు చిరస్థాయిగా నిలిచేలా మేకపాటి రాజమోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.200 కోట్ల విలువైన సొంత ఆస్తుల్ని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. తమ కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ కాలేజిని.. మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని ఆయన సీఎం జగన్ ను కోరుతున్నారు. మేకపాటి సూచనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కొడుకు కోసం రూ.200 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇచ్చేస్తున్న మేకపాటి నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మరి.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జగన్ సర్కారు ఎప్పుడు చేస్తుందో చూడాలి.


Tags:    

Similar News