మహిళా మంత్రుల టికెట్ కి జగన్ మార్క్ టిక్కు ...?

Update: 2022-10-23 07:21 GMT
జగన్ ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయని అంటారు. ఆయన గురించి చెప్పుకోవాలీ అంటే ట్రెడిషనల్ పాలిటిక్స్ కి ఆయన పక్కా వ్యతిరేకం. అలాగే రాజకీయాల్లో ఆయన చూసేది గెలుపు లెక్కలనే. వాటికి సరితూగకపోతే ఎంతటి సన్నిహితులు అయినా పక్కన పెట్టేస్తారు అంటారు. ఇది చాలా సార్లు రుజువు అయింది. తనను చెడా మడా తిట్టిన వారిని సైతం జగన్ పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చి మంత్రులను చేసిన వ్యూహాలు కూడా ఆయనవే.

అంటే ఇక్కడ ఒక్క విషయం స్పష్టం. పార్టీ బాగుపడుతుంది. అధికారంలోకి వస్తుంది అంటే జగన్ వారికి అందలం ఇస్తారు. లేదు అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా వెనకన పెట్టేస్తారు.  దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. జగన్ విషయంలో ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా కూడా తట్టుకోలేని విధంగా విరుచుపడిపోయే వారు గత క్యాబినేట్లో మంత్రులుగా ఉండేవారు. వారు తమకు పదవులు అయిదేళ్ళూ కంటిన్యూ అవుతాయని కూడా భావించారు.

కానీ జగన్ వారిని చాలా ఈజీగానే తప్పించేశారు. ఆ స్థానంలో వేరే వారిని తెచ్చి మంత్రులుగా చేశారు. అంటే జగన్ మార్క్ లెక్కలు ఇలాగే ఉంటాయని నాడే చాలా మందికి అర్ధమైంది. ఇపుడు మంత్రి పదవుల కధ ముగిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల మీదనే పార్టీలో చర్చ సాగుతోంది. జగన్ కాకుండా క్యాబినేట్లో పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వారందరికీ టికెట్ గ్యారంటీ అని సాధారణంగా అనుకుంటారు. ఎందుకంటే మూడేళ్ల తరువాత విస్తరించిన మంత్రి వర్గంలో ఏరి కోరి చాలా మందిని తీసుకున్నారు అంటే వారి పనితీరు నచ్చే కదా అన్నదే చర్చ.

కానీ ఆ కధ వేరు రేపటి ఎన్నికల్లో టికెట్ల కధ వేరు అన్నదే జగన్ పొలిటికల్ ఫిలాసఫీ. ఈ విధంగా చూస్తే కనుక జగన్ ఇద్దరు మంత్రులకు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు అని అంటున్నారు. ఆ ఇద్దరూ కూడా మహిళా మంత్రులు కావడం విశేషం. వీరిలో ముందుగా ఫైర్ బ్రాండ్ లేడీ, మంత్రి రోజా గురించే చెప్పుకోవాలి. ఆమె వైసీపీలో తన వాయిస్ ని బలంగా వినిపిస్తారు. ప్రత్యర్ధులను చెడుగుడు ఆడతారు. అలాంటి రోజాకి ఈసారి టికెట్ దక్కదు అని అంటున్నారు.

ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆమెకు పట్టు పోయింది అన్నదే వైసీపీ పెద్దల వద్ద ఉన్న సర్వే నివేదిక. ఈ నివేదిక ప్రకారం రోజాకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.  దాంతో పాటు ఆమె వ్యతిరేక వర్గం బలంగా ఉంది. వారంతా బీసీలు. దాంతో ఈసారి బీసీ కార్డుతో ప్రయోగం చేయడం ద్వారా మాజీ మంత్రి గాలి ముద్దుక్రిష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ ని ఓడించాలని వైసీపీ స్కెచ్ వేస్తోంది.

ఈసారి భానుప్రకాష్ కి సింపతీ కూడా కలసి వస్తుంది. గతసారి ఆయన ఓడినా జనంలో ఉంటున్నారు. ఇక రోజా వైపు తీసుకుంటే ఆమెకు 2019 ఎన్నికల్లోనే టికెట్ ఇవ్వవద్దు అని స్థానిక నేతలు పట్టుబడినా జగన్ మాత్రం సర్దిచెప్పి టికెట్ ఇప్పించారు. అలాగే గెలిచిన తరువాత మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏపీఐఐసీ చైర్మన్ వంటి కీలక పదవి ఇచ్చారు. రెండవ విడతలో ఏకంగా మంత్రిని చేశారు. ఒక విధంగా జగన్ ఆమె విషయంలో రుణం తీర్చుకున్నారు అనే అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అని సర్వే నివేదికలు వస్తే కనుక ఎంతటి వారిని అయినా తప్పించాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దాంతో నగరి రాజకీయాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాకు ఈసారి టికెట్ మిస్ అవుతుంది అని అంటున్నారు. మరి దానికి ఆమె ఏమి చేస్తుందో చూడాలి. ఈమె సంగతి ఇలా ఉంటే అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నుంచి మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ కి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉవ్వరని తెలుస్తోంది.

ఆమె 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం గెలిచారు. ఆమె తొలిసారి పోటీ చేసినా టీడీపీ నుంచి ఉన్న బలమైన అభ్యర్ధిని ఓడించారు. కురుబ సామాజికవర్గానికి చెందిన ఆమెకు ఆ కోటాలో జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఆమె ఎక్కువగా బెంగుళూరులో ఉంటారని, నియోజకవర్గం మీద పట్టు లేదని అంటున్నారు. దాంతో పాటు తాజా సర్వేలలో ఆమె మీద వ్యతిరేకత ఉండడంతో ఆమెకి టికెట్ కట్ అని ప్రచారం సాగుతోంది.

ఈ విధంగా ఇద్దరు మహిళా మంత్రులకు టికెట్లు ఇవ్వవద్దు అని వైసీపీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది అన్నది ఇప్పటికి వచ్చిన వార్త. మరి కొందరికి కూడా రానున్న రోజుల్లో వారి పనితీరు ఆధారంగా టికెట్లు దక్కవు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పాతిక మంది మంత్రులలో అరడజన్ మంది  దాకా ఈసారి టికెట్లు దక్కని వారిలో ఉంటారని ప్రచారం అయితే సాగుతోంది. వారిలో సీమ జిల్లాల నుంచి ఇద్దరు ఉన్నారని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాల నుంచి ఒకరు, కోస్తా నుంచి మరొకరు ఉంటారని చెబుతునారు.
Tags:    

Similar News