మోడీ మాటః రోహిత్ మ‌ర‌ణం క‌లిచివేసింది

Update: 2016-01-22 12:03 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న హెచ్‌ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స్పందించారు. ల‌క్నోలోని బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్ర‌ధాన‌మంత్రి అక్క‌డి  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని వర్గాలకు మేలు చేసిన మహా వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో మేలు చేశారని ఆయ‌న్ను ప్ర‌తి ఒక్క‌రు గుర్తుంచుకోవాల‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సంద‌ర్భంగా అన్నారు. జీవితంలో సమస్యలకు పరిష్కార మార్గం చూపేది విద్య అని వివరిస్తూ...విద్య ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది తెలుస్తుందని అన్నారు.

జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు, సమస్యలెదురవుతాయని ఒక్కొక్క దానిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడమే జీవిత లక్ష్యం అని తెలిపారు. రోహిత్ ఆత్మ‌హ‌త్య గురించి ప్ర‌స్తావిస్తూ తెలివైన విద్యార్థి ఆత్మ‌హ‌త్య  చేసుకునే ప‌రిస్థితి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఈ విష‌యంలో రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టాల‌ని కోరారు. భార‌త‌మాత త‌న ప్రియ పుత్రుడిని కోల్పోయింద‌ని, రోహిత్ త‌ల్లి ప‌డుతున్న ఆవేద‌న‌ను తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని చెప్పారు.

ప్రతీ వ్యక్తి సమున్నత స్థానానికి చేరుకోవాలన్నదే బాబా సాహెబ్ లక్ష్యమని...ఆయ‌న స్పూర్తితో విద్యార్థులు ముందుకువెళ్లాల‌ని కోరారు. మ‌రోవైపు ప్ర‌భుత్వ విధానాల గురించి కూడా మోడీ స్పందించారు. అంబేద్కర్ ఆర్థిక విధానాలను విస్మరించి దేశం ముందుకు వెళ్లలేదని తెలిపారు. అన్నివ‌ర్గాల‌ను క‌లుపుకొని త‌మ ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంద‌ని చెప్పారు.
Tags:    

Similar News