గులాబీ తోటలో మొదలైన 'పట్నం' మంట

Update: 2023-05-25 09:57 GMT
మాజీ మంత్రి.. ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి నోటి నుంచి వచ్చిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. గులాబీ తోటలో కొత్త మంటలు పుట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

మహేందర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. 'ఒక పార్టీ గుర్తుపైన గెలిచి మరో పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తిరస్కరిస్తారు' అని వ్యాఖ్యానించారు.

ఇక్కడితో ఆగని ఆయన.. ఇటీవల వెలువడిన  కర్ణాటక ఫలితాల్ని ప్రస్తావించటం గమనార్హం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తిరస్కరిస్తారన్న జోస్యం చెప్పిన వైనం చూస్తే.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ లో బోలెడంత రచ్చ ఖాయమన్న మాట వినిపిస్తోంది.

2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ఓటమిపాలు కావటం.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోహిత్ రెడ్డి తర్వాతి కాలంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నేతలకు ఏ మాత్రం పొసగని వేళ.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. పట్నం మహేందర్ రెడ్డి గళం విప్పటం ఆసక్తికరంగా మారింది.

తాండూరులో తన క్యాడర్ చెక్కు చెదర్లేదని.. గతంలో నాలుగుసార్లుతాను ఎమ్మెల్యేగా గెలిచి.. నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేసినట్లుగా చెప్పుకున్నారు. జూన్ 21 నుంచి ప్రజల్లోకి వెళ్లి పల్లెపల్లెకు పట్నం కార్యక్రమాన్నిచేపడతానని చెబుతున్న మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఒకవేళ.. ఇతర పార్టీల్లో గెలిచి గులాబీ పార్టీలోకి వచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదన్నదే మాట అయితే.. మరి వారిని పార్టీలోకి తీసుకున్న వేళలో మహేందర్ రెడ్డిలాంటి వారు మౌనంగా ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా మహేందర్ రెడ్డి గళం విప్పారు కానీ.. రానున్న రోజుల్లో మరింత మంది గళం విప్పటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Similar News