విచార‌ణ‌కు వెళ్ల‌ని ర‌విప్ర‌కాశ్‌..ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు!

Update: 2019-05-15 09:13 GMT
ఫోర్జ‌రీ.. మోసంతో పాటు.. సైబ‌ర్ నేరానికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఆయ‌న‌పై ఉన్న నేరారోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు సైబ‌రాబాద్ పోలీసులు. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాకుండా అజ్ఞాతంలో ఉన్న ఆయ‌న‌.. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఇందులో ప‌లు సంచ‌ల‌న అంశాల్ని ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. పోలీసులు ఇచ్చిన నోటీసు ప్ర‌కారం ఈ రోజు ఆయ‌న కానీ పోలీసుల ఎదుట హాజ‌రుకాని ప‌క్షంలో ఆయ‌నకు అరెస్ట్ త‌ప్ప‌దంటున్నారు. ఈ క‌థ‌నం రాసే స‌మ‌యానికి ర‌విప్ర‌కాశ్ అజ్ఞాతంలోనే ఉన్నారు త‌ప్పించి.. ఆయ‌న జాడ ఎవ‌రికి తెలీని ప‌రిస్థితి.
ఇదిలా ఉంటే.. ఆయ‌న ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చూస్తే.. ప‌లు అంశాల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. మే10న తాను రోజూ మాదిరి టీవీ9 ఆఫీసులోకి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నార‌ని.. లోప‌ల వాటాదారుల మీటింగ్ జ‌రుగుతోంద‌ని.. బ‌ల‌వంతంగా ఆఫీసులోకి వెళితే క‌స్ట‌డీలోకి తీసుకుంటామ‌ని పోలీసులు చెప్పిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు.

ఆ త‌ర్వాత ఆయ‌న్ను టీవీ9 సీఈవో ప‌ద‌వి నుంచి తీసేయ‌టం తెలిసిందే. మైహోం రామేశ్వ‌ర‌రావు 2016లోనే టీవీ9ను ద‌క్కించుకోవాల‌న్న ఉద్దేశంతో త‌మ‌ను సంప్ర‌దించార‌ని ర‌విప్ర‌కాశ్ పేర్కొన్నారు. అందుకు తాను అంగీక‌రించ‌లేద‌న్నారు.

రామేశ్వ‌ర‌రావు ఆలోచ‌న వెనుక రాజ‌కీయ ఎజెండా ఉంద‌ని.. పైగా ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడ‌ని చెప్పారు. రామేశ్వ‌ర‌రావు చిన‌జీయ‌ర్ స్వామికి అనుచ‌రుడ‌న్నారు. త‌న రాజ‌కీయ‌.. సైద్ధాంతిక సిద్ధాంతాల్ని జొప్పించే ఉద్దేశంతోనే టీవీ9ను టేకోవ‌ర్ చేసుకోవాల‌ని భావించార‌న్నారు. ఈ కార‌ణంతోనే తాను ఆ ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకోలేద‌న్నారు.

మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే క్ర‌మంలో ఇంకో ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు ర‌విప్ర‌కాశ్‌.  2018 సెప్టెంబ‌రులో తాను అమెరికాలో ఉన్నాన‌ని.. ఆ స‌మ‌యంలో త‌న‌కు న్యూస్ రూమ్ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జ‌రిగాయ‌ని.. ఆ వార్త‌ను ఎలా క‌వ‌ర్ చేయాలో రామేశ్వ‌ర‌రావు కుమారుడు.. సోద‌రుడు డిక్టేట్ చేస్తున్న‌ట్లుగా ఆఫీసు నుంచి ఫోన్ చేసి చెప్పార‌న్నారు. రేవంత్ రెడ్డికి రామేశ్వ‌ర‌రావు వారు రాజ‌కీయ శ‌త్రువు కావ‌టంతో ఆయ‌న్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా ర‌విప్ర‌కాశ్ చెప్పారు. ఇంత‌కాలం మౌనంగా ఉన్న ర‌విప్ర‌కాశ్‌.. తాజాగా ఇచ్చిన ర‌హ‌స్య ఇంట‌ర్వ్యూ ఒక సంచ‌ల‌నానికి తెర తీస్తే.. రానున్న రోజుల్లో మ‌రెన్ని సంచ‌ల‌నాల‌కు ఆయ‌న తెర తీస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News