రాయ‌పాటి మాట‌!... అంత‌టా టీడీపీనేన‌ట‌!

Update: 2019-03-17 08:56 GMT
నిన్న‌టికి నిన్న టీడీపీ అధిష్ఠానంపై త‌న‌దైన శైలి అల‌క‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రితో ఫోన్లు చేయించుకుని ఆ త‌ర్వాత రాజీకి వ‌చ్చిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌ - న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివరావు... ఇప్పుడు పూర్తిగా స్వ‌రం మార్చేశారు. టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక గంద‌ర‌గోళంగా ఉండ‌ట‌మే కాకుండా... ఈ త‌ర‌హా ఎంపిక‌తో ముందుకెళితే,...మ‌ళ్లీ అధికారం దేవుడెరుగు... గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు కూడా గెల‌వ‌లేమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాయ‌పాటి... ఇప్పుడు నిజంగానే స్వ‌రం మార్చేశారు. టీడీపీలో ఇప్పుడు అంతా ఆల్ ఈజ్ వెల్ గానే ఉందని - పార్టీ అధినేత చంద్ర‌బాబు అభ్య‌ర్థుల ఎంపిక‌పై తీసుకున్న నిర్ణ‌యం బాగా ఉంద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల వెంక‌న్న‌ను ద‌ర్శించుకునేందుకు నేటి ఉద‌యం తిరుమ‌ల‌కు వ‌చ్చిన రాయ‌పాటి... స్వామి వారి ద‌ర్శ‌నానంత‌రం త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు.

చంద్ర‌బాబు అభ్య‌ర్థుల ఖ‌రారు చాలా బాగా ఉంద‌ని - ఈ త‌ర‌హా వ్యూహంతో ఈ ఎన్నిక‌ల్లో 150 అసెంబ్లీ సీట్ల‌తో పాటు 25 ఎంపీ స్థానాల‌ను కూడా ఈజీగానే గెలుచుకుంటామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ సీట్ల‌ను గెలుచుకోవ‌డం ద్వారా దేశ భావి ప్ర‌ధానిని చంద్ర‌బాబే నిర్ణ‌యిస్తార‌ని కూడా రాయ‌పాటి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా టీడీపీ గెలుపును ఆప‌లేర‌న్న రాయ‌పాటి... ఈ ద‌ఫా కేంద్రంలోనూ చ‌క్రం తిప్పే పార్టీ టీడీపీనేన‌ని చెప్పుకొచ్చారు. మొత్తంగా అల‌క పాన్పు ఎక్కిన సంద‌ర్భంగా తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు పూర్తి విరుద్ధంగా మాట మార్చేసిన రాయ‌పాటి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశార‌నే చెప్పాలి.
Tags:    

Similar News