తెలంగాణ‌ పై చంద్ర‌బాబు స‌వ‌తి ప్రేమ‌!

Update: 2018-11-06 01:30 GMT
కాంగ్రెస్ తో టీడీపీ జ‌త క‌ట్ట‌డంపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు చెల‌రేగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీని గ‌ద్దె దించేందుకు తాను కాంగ్రెస్ తో క‌లిసి ముందుకు వెళ్ళ‌డం చరిత్రాత్మ‌క ఘ‌ట్టం అని - భావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం అది అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు నొక్కి వ‌క్కాణిస్తున్నారు. త‌మది జాతీయ పార్టీ అని...తాను ఓ జాతీయ పార్టీ అధ్య‌క్షుడిగా ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటుగా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతాన‌ని చంద్ర‌బాబు గ‌ప్పాలు కొడుతున్నారు. అయితే, జాతీయ స్థాయి నేత‌ల‌కు దిశా నిర్దేశం చేయ‌బోతోన్న బాబు...ఓ జాతీయ స్థాయి నేత క‌నీస బాధ్య‌త‌ను విస్మ‌రించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాను తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌బోన‌ని బాబు..టీటీడీపీ నేత‌ల‌తో అన్న‌ట్లు తెలుస్తోంది. జాతీయాధ్య‌క్షుడి హోదాలో చంద్ర‌బాబు తెలంగాణ‌లో ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం ఏమిటని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు...అంటే ఏపీ - తెలంగాణ‌ల‌తో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల‌లో టీడీపీకి ఆయ‌నే పెద్ద‌దిక్కు. అయితే, చంద్ర‌బాబు మాత్రం...తాను టీడీపీ ఏపీ అధ్యక్షుడు - జాతీయాధ్య‌క్షుడిగా మాత్ర‌మే ఉంటాన‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను తెలంగాణ‌లో టీడీపీ..మ‌హాకూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌న‌ని...చెప్పిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి - బీజేపీ తరఫున  అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తెలంగాణ‌ ఎన్నికల ప్ర‌చారం చేశారు. రేపో మాపో వామ‌ప‌క్షాల వారు కూడా త‌మ జాతీయ స్థాయి నేత‌ల‌ను ప్ర‌చారానికి తీసుకువ‌స్తారు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు త‌న‌కు రెండు క‌ళ్ల‌ని చెప్పుకునే చంద్ర‌బాబు మాత్రం..తెలంగాణ‌పై స‌వ‌తి ప్రేమ‌ను చూప‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి, ఆ విమ‌ర్శ‌కుల‌ కోస‌మైనా...బాబు గారు తెలంగాణ‌పై క‌నిక‌రిస్తారో లేదో వేచిచూడాలి.


Tags:    

Similar News