ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య ప్రత్య‌క్ష పోరు!

Update: 2021-07-22 23:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్యులైన ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష పోరు జ‌ర‌గ‌నుందా?  ఇటు రాజ‌కీయాల్లో, అటు సొంత పార్టీలో పెద్ద ఎత్తున ప‌ట్టు క‌లిగి ఉన్న ఈ ఇద్ద‌రు నేత‌లు ప్ర‌త్య‌క్షంగా త‌ల‌ప‌డ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇదంతా తెలంగాణ సీఎ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌విత, ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సీత‌క్క గురించి.

సింగ‌రేణిలో కార్మికులు, ఉద్యోగుల స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించేందుకు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించారు. దీనికి సంబంధించి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ‌మైన‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) విజయం సాధించింది. ఈ ఎన్నిక‌ కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నాటికి ముగిసిపోయింది. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో కరోనా ఉద్ధతి కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వ‌స్తోంది. అయితే ప్రస్తుతం వైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టడంతో సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలైన ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కొందరు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు సింగ‌రేణి కార్మికుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు 61 సంవ‌త్స‌రాల‌కు పెంచుతున్నామ‌ని, సింగ‌రేణి కోసం మెడిక‌ల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని ఇటీవ‌లే సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. త‌ద్వారా త‌మ పార్టీ అనుబంధ గుర్తింపు సంఘానికి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) తరఫున ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేర‌కు టీపీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యార‌ని స‌మాచారం. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అసంపూర్తిగానే మిగిలిన నేపథ్యంలో వాటిని ప్ర‌స్తావిస్తూ ఎమ్మెల్యే సీత‌క్క త‌న ఎదురుదాడి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య ప్రత్య‌క్ష పోరు ఖాయ‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News