ఐఐటీయన్లలో 65% అమెరికాకు వెళితే.. 85% ఆ పని చేస్తున్నారట

Update: 2023-06-13 10:00 GMT
ప్రపంచంలో పేరున్న సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుంది ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ). ఇందులో సీటు కోసం ఎనిమిదో తరగతి నుంచే కసరత్తు చేసే వాళ్లు ఎందరో. ఐఐటీలో సీటు సాధిస్తే.. జీవితమే మారిపోతుందన్న మాట అక్షర సత్యమన్న విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన నేషనల్ బ్యూర్ ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్ బీఈఆర్) సంస్థ చేసిన అధ్యయనం మరోసారి స్పష్టం చేస్తోంది.

అత్యున్నత శిక్షణలో రాటు దేలే ఐఐటీ విద్యార్థులకు విదేశీ విద్యా సంస్థలు మాత్రమే కాదు.. విదేశీ కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నాయి. దీంతో.. ఐఐటీ విద్యార్థుల్లో ఎక్కువ మంది విదేశీ బాట పడుతున్న వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని వెల్లడించింది. భారత ఐఐటీయన్ల తదుపరి గమ్యస్థానం అమెరికాగా తేల్చారు. విదేశాలకు వెళుతున్న ఐఐటీయన్లలో 65 శాతమ మంది అమెరికాకు వెళుతున్నారని.. వారిలో 85 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి.. అక్కడి ప్రముఖ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లనుంచి సీఈవోల వరకు బాధ్యతలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు.

దేశంలోని 23 ఐఐటీల్లో 16,598 సీట్ల కోసం ఈ ఏడాది నిర్వహించిన పరీక్షకు1.89 లక్షల మంది పోటీ పడ్డారని సదరు నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని ఐఐటీల్లో కూడా చెన్నై.. ముంబయి.. ఖరగ్ పూర్.. ఢిల్లీ.. కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకే విదేశీ సంస్థలు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నట్లుగా పేర్కొన్నారు. సదరు నివేదిక ప్రకారం చూస్తే.. దేశంలో ఐఐటీల నుంచి పట్టాలు అందుకుంటున్న విద్యార్థుల్లో 35 శాతం మంది విదేశాలకు వెళ్లిపోతున్నట్లుగా తేల్చారు. ఐఐటీ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో టాప్ వెయ్యిలో నిలుస్తున్న విద్యార్థుల్లో 36 శాతం మంది విదేశాల బాట పడుతున్నట్లుగా గుర్తించారు.

ప్రపంచంలో 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ హైపొటెన్షియల్ వ్యక్తిగత వీసాలను జారీ చేస్తే.. వారిలో భారత ఐఐటీ విద్యార్థులు మొదటి స్థానంలో ఉన్నట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. భారత ఐఐటీ అంటే విదేశీ సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందని చెప్పటానికి వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఉదంతమే చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు. ఆ వర్సిటీకి ఐఐటీ హోదా కల్పించిన తర్వాత అక్కడ చదువుకునే విద్యార్థులకు విదేశీ ప్లేస్ మెంట్స్ ఏకంగా 540 శాతం పెరిగినట్లుగా వెల్లడైంది. ఐఐటీనా మజాకానా?

Similar News