విభజన సమయంలో సోనియమ్మ ఇంతే మాట్లాడి ఉంటే..?

Update: 2015-03-18 07:11 GMT
ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు అన్న మాట ప్రతి సీమాంధ్రుడి మనసులో మంగళవారం అనిపించే ఉంటుంది. ఉమ్మడిగా ఉన్న ఒక రాష్ట్రాన్ని బర్త్‌డే కేక్‌ కోసినంత సింఫుల్‌గా కోసిపారేసి.. కొట్టుకు చావండన్నట్లు వ్యవహరించటం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మాత్రమే సాధ్యమైంది.

ఒక రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇరు ప్రాంతాల వారీకి నష్టం కలగకుండా.. వివాదరహితంగా విభజన చేయటం మంచిది. కానీ.. ఈ విషయలో సోనియమ్మ గాంధీ తప్పుల మీద తప్పులు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న హామీతో 2004లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ 2009 వరకే మాట్లాడింది లేదు. 2009 ఎన్నికల్లో తెలంగాణ హామీ ఇవ్వకుండానే ఎన్నికల్లోకి వెళ్లిన ఆ పార్టీ.. వైఎస్‌ పుణ్యమా అని మళ్లీ మరోసారి అధికారంలోకి వచ్చింది. దురదృష్టవశాత్తు వైఎస్‌ మరణించటం..తదనంతరం జరిగిన పరిణామాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే సమయంలో ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆవేదనే ఉండి ఉంటే.. చట్టంలోనే తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. అదేమీ చేయకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా వ్యవహరించటంతో తప్పుల తడకగా ఏపీ విభజన బిల్లు సిద్ధం చేశారు.

అలా మొదలైన తప్పుటడుగులు ఎన్ని సమస్యలు తీసుకొచ్చాయో తెలిసిందే. తాజాగా ఏపీ విభజన సందర్భంగా సీమాంధ్రకు ఇచ్చిన హామీల్ని ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్‌ చేవారు. ఇప్పుడు ఇన్ని మాటలు చెబుతున్న సోనియమ్మ.. విభజన సమయంలోనే తప్పులు దొర్లకుండా ఇవే విషయాల్ని చట్టంలో చేర్పించినా కానీ.. లేదంటే ఏపీకి ఎలాంటి అన్యాయం చేయటం లేదన్న భరోసాను ఇస్తూ పార్లమెంటులో మాట్లాడినా బాగుండేది. అప్పట్లో నోటికి ఏదో అడ్డు పడినట్లు మౌనంగా ఉన్న ఆమె.. ఇప్పుడు మాత్రం ఏపీ మీద వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తున్నారు. గొంతుకోసి.. వెన్న రాస్తానంటే గాయం తగ్గిపోతుందా సోనియమ్మ..?

Tags:    

Similar News