పోగో..డిస్నీ..స్నూపీ..మిక్కీ మౌస్‌..చార్లీ బ్రౌన్

Update: 2017-07-05 10:40 GMT
ఏందీ కార్టూన్ నెట్ వ‌ర్క్ గోల అని ఫీలైతే త‌ప్పులో కాలేసిన‌ట్లే. అమాయ‌కంగా క‌నిపించే ఈ పేర్ల‌లో చాలానే మాయ ఉంది. డ్ర‌గ్స్ దందాను ఇలాంటి ముద్దు ముద్దు పేర్ల‌తో న‌డిపే కొత్త త‌ర‌హా దందాను పోలీసులు ఇప్పుగు బ‌య‌ట‌కు తెచ్చారు. స్కూళ్లు.. కార్పొరేట్ కాలేజీల్లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని గుర్తించిన హైద‌రాబాద్ పోలీసులు.. ఈ రాకెట్‌ కు సంబంధించి ప‌లువురిని అదుపులోకి తీసుకోవ‌టం తెలిసిందే.

తొమ్మిది త‌ర‌గ‌తి చ‌దువుకునే విద్యార్థికి డ్ర‌గ్స్ కు బానిస కావ‌టం ఏంది? త‌న‌కు డ్ర‌గ్స్ అవ‌స‌ర‌మై.. త‌న న‌గ్న చిత్రాల్ని సైతం పంపేందుకు వెన‌క్కి త‌గ్గ‌ని మ‌రో స్కూల్ విద్యార్థిని ఉదంతంతో స‌హా.. ఇలాంటి షాకింగ్ అంశాలు పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. స్కూలు పిల్ల‌లేంది? డ‌్ర‌గ్స్ వాడ‌టం ఏమిట‌న్న సందేహం పోలీసుల్ని వెంటాడి వేధిస్తోంది. దీనికి స‌మాధానం తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించిన అధికారుల‌కు దిమ్మ తిరిగే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ప్ర‌ముఖ పాఠ‌శాలల్లో చ‌దువుతున్న స్కూలు విద్యార్థులు డ్ర‌గ్స్ కోసం చిత్ర విచిత్ర‌మైన పేరు పెట్టారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా.. పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన కార్టూన్ పేర్లు పెట్టేసి.. ఆ కోడ్ లాంగ్వేజ్ ద్వారా త‌మ‌కు కావాల్సిన మ‌త్తు ప‌దార్థాల్ని తెప్పించుకునే వైనాన్ని గుర్తించారు.

పోగో.. డిస్నీ.. స్నూపీ.. మిక్కీ మౌస్‌.. చార్లీ బ్రౌన్ పేర్ల‌తో డ్ర‌గ్స్ దందా న‌డుస్తున్న విష‌యాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత రెడ్ బుల్ తో మొద‌లై.. చివ‌ర‌కు డ్ర‌గ్స్ వినియోగం వ‌ర‌కూ వెళుతుంద‌న్నది తాజా విచార‌ణ‌లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లు తొమ్మిది త‌ర‌గ‌తి చ‌దివే పిల్ల‌ల‌కు డ్ర‌గ్స్ ఎలా చేతికి చిక్కాయి? వారీ రొంపిలోకి ఎలా దిగార‌న్న అంశంపై దృష్టి సారించిన పోలీసుల‌కు అస‌లు విషయాన్ని రాబట్టారు.

ఓ ప్ర‌ముఖ కార్పొరేట్ పాఠ‌శాల విద్యార్థి త‌న అన్న స్నేహితుడి ద్వారా ఎల్ఎస్‌డీ డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డ్డాడు. ఇదే విష‌యాన్ని త‌న ఇద్ద‌రు స్నేహితుల‌కు తెలియ‌జేశాడు. వారు కూడా డ్ర‌గ్స్ తీసుకునేందుకు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. అలా ముగ్గురితో మొద‌లైన భాగోతం చివ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో ఈ డ్ర‌గ్స్ చ‌ట్రంలోకి దిగ‌బ‌డిపోయార‌ని చెబుతున్నారు.

స‌ర‌దాగా మొద‌లైన ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం చివ‌ర‌కు ఆ మ‌త్తుకు బానిస అయిన‌ట్లుగా గుర్తించారు. అన్నింటికి మించి.. దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ డ్ర‌గ్స్‌కు బానిస అయిన వారిలో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే అమ్మాయి కూడా ఉండ‌టం. వాట్స‌ప్ గ్రూపుతో త‌మ‌కు కావాల్సిన డ్ర‌గ్స్‌ను పొట్టి పొట్టి కార్టూన్ పేర్ల‌తో పిలుచుకుంటూ.. ఆ కోడ్ లాంగ్వేజ్ తో త‌మ‌కు అవ‌స‌ర‌మైన డ్ర‌గ్స్‌ను పొందుతున్నారు. దీనికి బానిసలైన వారు వాటి కోసం త‌మ పుస్త‌కాల్ని అమ్మేయ‌ట‌మేకాదు.. క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. డ్ర‌గ్స్ కొనేందుకు డ‌బ్బుల్లేక‌.. త‌న న‌గ్న చిత్రాల్ని పంపేందుకు సైతం తొమ్మిదో త‌ర‌గ‌తి అమ్మాయి సిద్ధ‌మైందంటే ఈ డ్ర‌గ్స్ దుర్మార్గం ఎంత‌లా ఉంటుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టివ‌ర‌కూ వెలికి తీసిన స‌మాచారం ప్ర‌కారం దాదాపు 400 మంది వ‌ర‌కూ ఈ డ్ర‌గ్స్  ఊబిలో చిక్కుకుపోయిన‌ట్లుగా భావిస్తున్నారు.  వీరిలో తొమ్మిది త‌ర‌గ‌తి మొద‌లు  డిగ్రీ విద్యార్థులు.. ఐటీ ఉద్యోగులు.. వివిధ రంగాల‌కు చెందిన వారు ఉన్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News