ఐటీ గ్రిడ్ లో అశోక్ కు బిగుస్తున్న ఉచ్చు..

Update: 2019-03-06 06:48 GMT
ఐటీ గ్రిడ్ కేసులో తెలంగాణ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం బయటపడడం.. దీనివెనుక టీడీపీ మూలాలున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ ప్రతిపక్ష వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే..

అయితే ఐటీ గ్రిడ్స్ కంపెనీ చైర్మన్ అశోక్ మాత్రం టీ పోలీసులకు చిక్కడం లేదు. ఆయన ఏపీ పోలీసుల సంరక్షణలో ఉన్నట్టు సమాచారం. అందుకే అశోక్ ను ఎలాగైనా పట్టుకోవాలని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు బుధవారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలను  టీ పోలీసులు అలెర్ట్ చేశారు. ఈ కేసు వ్యవహారంలో మొదటిసారి తెలంగాణ పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటుండడం విశేషం.

ఎథికల్ హ్యాకర్ల సహాయంతో ప్రధానంగా ఐటీ గ్రిడ్స్ కంపెనీలో   లాక్ చేసిన అత్యాధునిక కంప్యూటర్లలో ఉన్న డేటాను స్వాధీనం చేసుకోవడానికి టీ పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బుధవారం పాస్ వర్డ్ తో ప్రొటెక్టివ్ గా ఉన్న కంప్యూటర్లను ఈ హ్యాకర్ల సాయంతో పోలీసులు తెరిచి దాదాపు 40 జీబీల డేటాను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఏపీలో జరిగిన గత ఉప ఎన్నికల్లో సేవామిత్ర యాప్ ను ట్రయల్ రన్ గా వాడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్ ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ఇండియా కంపెనీ రూపొందించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటర్ల ఆధార్ డేటాతోపాటు వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ యథేచ్ఛగా వాడుకుంది. దీంతో ఐటీ గ్రిడ్ కంపెనీపై వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం.
Tags:    

Similar News