టీ బ్రేక్ కు ముందు టీమిండియాకు ట్రీట్

Update: 2021-11-29 09:30 GMT
మొగ్గంతా భారత్ వైపే ఉన్నట్టు కనిపించిన తొలి టెస్టు చివరకు డ్రా అయ్యేలా ఉంది. చివరి రోజు సోమవారం న్యూజిలాండ్ గట్టి పట్టుదల ప్రదర్శిస్తుండడంతో ఫలితం తేలేలా కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్ లో లాగానే పోరాడిన ఓపెనర్ టామ్ లేథమ్ 52 పరుగులతో రాణించాడు. అతడితో పాటు చివరి రోజు క్రీజులో దిగిన నైట్ వాచ్ మన్ విలియమ్ సోమర్ విల్లే (36) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ 33 ఓవర్లు భారత్ బౌలింగ్ దాడిని కాచుకున్నారు. ముఖ్యంగా లేథమ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. 146 బంతులు ఆడిన అతడు అసలు వికెట్ ఇచ్చేవాడిలా కనిపించలేదు.

ఉమేశ్ నిలిపాడు

లేథమ్, సోమర్ విల్లే పట్టుదలతో న్యూజిలాండ్ టెస్టును డ్రా చేసే అవకాశం అందిపుచ్చుకుంది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ దక్కలేదు. ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ ప్రభావవంతంగా కనిపించకున్నా.. మరో పేసర్ ఉమేష్ యాదవ్ మాత్రం పదునుగా బంతులేశాడు.

ఉమేష్ లయ తప్పకుండా చేసిన బౌలింగ్ ఫలితాన్నిచ్చింది. అతడి షార్ట్ బంతిని హుక్ చేసే ప్రయత్నంలో సోమర్ విల్లే ఔటయ్యాడు. ఆన్ సైడ్ ఈ క్యాచ్ ను యువ శుబ్ మన్ గిల్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.అయినా, లేథమ్ గట్టి పోరాటంతో సవాల్ విసరసాగాడు. అశ్విన్ పడగొట్టాడు

భారత విజయానికి అడ్డుగోడలా నిలిచిన లేథమ్ ను అశ్విన్ బుట్టలో పడేశాడు. ఓ అద్బుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాలో ఉత్సాహం నింపాడు. అయితే, మరో ఎండ్ లోకెప్టెన్ కేన్ విలియమ్సన్ పాతుకుపోతున్నాడు. స్పిన్, పేస్ ను సమర్థంగా ఎదుర్కొంటూ మ్యాచ్ ను డ్రా వైపు నడిపించసాగాడు. మిడిలార్డర్ లో అతడికి సరిజోడైన సీనియర్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ అండగా నిలవడం.. టీ విరామం దగ్గర పడుతుండడంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయం అనిపించింది.

జడేజా ఆశలు రేకెత్తించాడు

టీ విరామానికి మరొక్క ఓవరే ఉందనగా ఆల్ రౌండర్ జడేజా మాయ చేశాడు. అతడు విసిరిన బంతిని కాస్త ముందుకొచ్చి ఆడబోయిన రాస్ టేలర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. జడేజా అప్పీల్ చేయడం అంపైర్ ఔటివ్వడం జరిగిపోయాయి. రీప్లే చూసినా.. బంతి లెగ్ వికెట్ ను తాకుతున్నట్లు స్పష్టంగా తెలిసిపోవడంతో టేలర్ వెనుదిరిగాడు.

అక్షర్ ఏంచేస్తాడో?

తొలి ఇన్నింగ్స్ లో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చింది అక్షర్ పటేల్. అతడి ఐదు వికెట్ల ప్రదర్శనతోనే టీమిండియా మళ్లీ మ్యాచ్ పై పట్టు సాధించింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ సైతం ఇప్పుడదే రీతిలో సాగుతోంది. ప్రధాన బౌలర్లు తలా వికెట్ తీసి ఆశలు కల్పించారు. ఇప్పుడిక అక్షర్ పటేల్ వంతు. అతడు మాయ చేసి చకచకా వికెట్లు తీస్తే ఈ టెస్టు టీమిండియా ఖాతాలో చేరుతుంది.


Tags:    

Similar News