విప‌క్షాల‌కు పిచ్చిప‌ట్టిందంటున్న మంత్రిగారు

Update: 2017-04-29 12:51 GMT
తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో మిర్చి ధర తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించిన తరువాత కూడా విపక్షాలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాయని విమ‌ర్శించారు. మిర్చి ధర తగ్గడానికి కారణాలు దిగుబడి అధికం అవ్వడమే కాకుండా, పంటను దిగుమతి చేసుకునే రాష్ట్రాలు ముందుకు రాకపోవడం ఒక కారణం అని తుమ్మ‌ల చెప్పారు. ఈ వాస్త‌వాలు గ్ర‌హించ‌కుండా విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో జరిగిన విధ్వంసం వెనుక విపక్షాల హస్తం ఉందని తుమ్మ‌ల ఆరోపించారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో తమ ఉనికి లేకుండా పోతుందన్న భయంతోనే విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఖమ్మం మార్కెట్‌యార్డులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తుమ్మ‌ల తెలిపారు. మార్కెట్‌యార్డుపై రైతులు దాడి చేయలేదని, కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు దాడి చేశారని తెలిపారు. టీడీపీ నేతల అనుచరులు రాజకీయ లబ్ధి కోసం కాంటాలు, సామాగ్రిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. దౌర్జన్యకారులు, తాబేదారులతో విధ్వంసం చేయాలని కొందరు చూస్తున్నారని తుమ్మ‌ల‌ నిప్పులు చెరిగారు. రైతులకు నష్టం చేసే ప్రయత్నాలు చేయొద్దని విపక్షాలకు కోరుతున్నామని తెలిపారు. ఏ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయాలో కూడా ప్రతిపక్షాలకు తెలియటం లేదన్నారు.

రైతులు గింజ నష్టపోకుండా ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స్పష్టం చేశారు. ఈసారి రాష్ట్రంలో మిర్చి దిగుబడి ఎక్కువగా ఉందన్నారు. మిగతా రాష్ర్టాల్లోనూ మిర్చి దిగుబడి ఎక్కువగా ఉందని చెప్పారు. తద్వారా మిర్చి ధర తగ్గడం మాట వాస్తమేనని పేర్కొన్నారు. మిర్చికి మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. మిర్చికి మద్దతు ధర కోసం కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందన్నారు. ఇప్పటికే మార్కెట్‌యార్డులో 70 శాతం మిర్చి కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 1.6 లక్షల మిర్చి బస్తాల కొనుగోళ్లు జరిగాయని స్పష్టం చేశారు. మిగతా 30 వేల మిర్చి బస్తాల కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు.  గత పదేళ్ల కంటే మెరుగైన ధర ఈ మూడేళ్లలో రైతులకు వచ్చిందన్నారు.

రాష్ట్రంలో భూసేకరణ ఎందుకని విపక్షాలు అనడం హాస్యాస్పదమని తుమ్మ‌ల వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు భూసేకరణ చేస్తుంటే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులు అప్పులపాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News