జగన్ పిట్టకథ : చంద్రపులి- బంగారుకంకణం!!

Update: 2018-01-03 15:29 GMT
జగన్ పిట్టకథ : చంద్రపులి- బంగారుకంకణం!!
  • whatsapp icon
జనరంజకమైన ప్రసంగాలతో రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకు పడడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది ఒక విలక్షణమైన శైలి. అచ్చమైన గ్రామీణ పొడుపు కథలు... పిట్టకథలు - సామెతలు ఇలా జన సామాన్యానికి బాగా చేరువ అయ్యేలా.. తన ప్రసంగం కంటెంట్ ను తయారు చేసుకుని... ఆ రకంగా ఆయన ప్రత్యర్థుల్ని ఓ ఆటాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పాదయాత్రలో 50 రోజులుగా సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బుధవారం నాడు ఇదే తరహాలో ఒక పిట్ట కథ చెబుతూ.. చంద్రబాబునాయుడు వ్యవహార సరళిని ఎండగట్టారు. జనం ఒకవైపు కేరింతలు కొడుతూ.. హర్షధ్వానాలు చేస్తుండగా.. చంద్రబాబునాయుడు ప్రజలను ఎలా కబళించేస్తున్నాడో చెబుతూ.. జగన్ చేసిన ప్రసంగం  పలువురిని ఆకట్టుకుంది. చంద్రబాబునాయుడు ను దెప్పిపొడవడానికి తెలుగునాట ప్రతి పసిపిల్లవాడికి కూడా తెలిసిన ‘‘పులి-బంగారు కంకణం’’ కథను జగన్ ఉదాహరణగా తీసుకున్నారు.

‘‘పులి - బంగారు కంకణం’’ అసలు కథ!

ఓ పులి ముసలిది అయిపోయింది. వేటాడి జంతువులను చంపి తినే శక్తి దానికి హరించుకుపోయింది. ఇలాంటి సమయంలో దానికి ఓ బంగారు కంకణం దొరికింది. ఆ బంగారు కంకణాన్ని చేత పట్టకుని.. అదని కాస్తా అడవిలో బాట పక్కనే ఓ చెట్టు కింద కూర్చుంది. దారమ్మట పోయే జనం దాన్ని చూసి తొలుత జడుసుకునేవాళ్లు.. కానీ ఆ పులి.. ‘‘అయ్యయ్యో భయపడొద్దు.. నేనిప్పుడు మారిపోయాను.. శాకాహారిని.. అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను.. కావలిస్తే.. ఇదిగో నా వద్ద బంగారు కంకణం ఉంది తీసుకోండి’’ అని నమ్మబలికేది. ఆ మాటలు నమ్మి ఎవరైనా బాటసారులు దాని చెంతకు వెళితే.. అప్పుడు ఒక్కదెబ్బతో వారిని కడతేర్చి తాపీగా ఆరగించేది. ఇలా ఒక్క బంగారు కంకణాన్ని.. చూపించి.. ప్రతిరోజూ ఒకరిని కబళిస్తూ జీవనం సాగించేది ఆ మోసకారి పులి...

జగన్ చెప్పిన చంద్ర-పులి కథ

అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. అడవికి అదే రాజు.. ఇష్టారాజ్యంగా అధికారం చెలాయిస్తూ ఉండేది. అడవిలో దొరికిన జంతువును దొరికినట్లుగా తినేస్తూ.. చెలరేగిపోతూ ఉండేది... (ఇదంతా గతంలో తొమ్మిదేళ్ల పాటూ సీఎంగా పరిపాలన సాగించిన చంద్రబాబునాయుడు గురించి అన్నమాట)!

ఇలాంటి నేపథ్యంలో అడవిలోని అన్ని జంతువులూ కూడబలుక్కున్నాయి. కలసికట్టుగా పోరాడి ప్రయత్నించి ఆ పులిని అడవినుంచి వెళ్లగొట్టాయి. (2004 లో చంద్రబాబు ఓటమి)

ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటూ ఆ చంద్రపులి ఊసు ఎక్కడా వినిపించలేదు. అది ఎవరినీ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రత్యక్షం అయింది. అడవి మొత్తం తిరిగి ‘‘నాకు ముసలితనం కూడా వచ్చేసింది.. 70 ఏళ్లు వచ్చేస్తున్నాయి.. నాకు ఇక వేటాడే శక్తి కూడా లేదు.. నేను ఇప్పుడు మారిపోయిన పెద్దపులిని.. నన్ను నమ్మడి.. కావలిస్తే.. నా వద్ద ఉన్న బంగారు కంకణాన్ని మీకిచ్చేస్తాను’’ అని నమ్మించింది. జంతువులు ఆ మాటలు నమ్మాయి. (బంగారు కంకణం అంటే చంద్రబాబు పాలన అనుభవం  అన్నమాట. నా అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడతా అనే ప్రమాణాలు అన్నమాట)

జంతువులు ఆ పెద్దపులికి తిరిగి అధికారం అప్పగించాయి. అది బంగారు కంకణంతో  చెట్టుకింద అధికార దర్పంతో కూర్చుంది. ఒక్కొక్క జంతువునూ కంకణం ఆశ చూపించి.. పిలిచేది స్వాహా చేసేసేది. (ఇదే తరహాలో.. కులానికి ఒక్క పేజీ కేటాయించి.. అబద్ధపు వరాలతో మేనిఫెస్టో చేసిన చంద్రబాబు... కులాల వారీగా జనాన్ని కబళించేస్తున్నారు...)

అంటూ ముగించారు జగన్. మొత్తానికి మోసకారి పెద్దపులితో చంద్రబాబునాయుడు ను పోలుస్తూ, తన రాజకీయ పరిపాలన అనుభవం అంటూ ఆయన చెప్పే మాయ మాటల్ని బంగారు కంకణంతో పోలుస్తూ జగన్ చెప్పిన కథ జనాన్ని ఆకట్టుకున్నదని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News