చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ కు బంపర్ ప్రైజ్.. మనీ 50 శాతం పెంపు

తాజాగా ట్రోఫీ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది.

Update: 2025-02-14 19:30 GMT

ప్రపంచ కప్ అంటే నాలుగేళ్లకోసారి జరుగుతుంది.. అప్పటివరకు జట్లన్నీ కలిసి ఆడే మరో టోర్నీ లేకుంటే ఆట పట్ల ఆకర్షణ ఎలా..? ఈ ఆలోచన నుంచి వచ్చిందే చాంపియన్స్ ట్రోఫీ. వన్డే ఫార్మాట్ లోనే జరిగినా.. మధ్యలో గ్యాప్ వచ్చింది. అదికూడా ఒకటీ, రెండు కాదు ఎనిమిదేళ్లు. చివరిసారిగా చాంపియన్ గా నిలిచిన జట్టేదో తెలుసా? పాకిస్థాన్. అదికూడా భారత్ పై గెలిచింది. 2017 తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్, 2021లో టి20, 2023లో వన్డే ప్రపంచ కప్ జరగడంతో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అవకాశం లేకపోయింది.

ఎట్టకేలకు ఈ ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాకిస్థాన్ వేదికగా నిర్వహించే ఈ టోర్నీలో భారత్ మాత్రం తమ మ్యాచ్ లను మార్చాలని పట్టుబట్టింది. ఈ మేరకు దుబాయ్ లో టీమ్ ఇండియా మ్యాచ్ లు జరగనున్నాయి.

వన్డే ప్రపంచ కప్ ను రెండుసార్లు గెలుచుకున్న వెస్టిండీస్, ఒకసారి నెగ్గిన శ్రీలంకలు ఈసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేదు. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే టోర్నీలో ఆడనున్నాయి. తాజాగా ట్రోఫీ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. చివరిసారి ట్రోఫీ జరిగిన 2017 నాటి కంటే దాదాపు 53 శాతం ప్రైజ్‌మనీని పెంచారు. రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని జట్లకు పంచనున్నారు.

చాంపియన్ కు రూ.20.8 కోట్లు, రన్నరప్‌ నకు రూ.10.4 కోట్లు, సెమీ ఫైనల్ చేరిన జట్లకు రూ.5.2 కోట్లు (ఒక్కొక్కదానికి),ఐదో, ఆరో స్థానం జట్లకు రూ.3 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానాలకు రూ.1.2 కోట్లు ఇవ్వనున్నారు. చివరి ప్లేస్‌ లో నిలిచిన జట్టుకు రూ.1.22 కోట్లు ఇస్తారు. ఒక్కో మ్యాచ్‌ కు రూ.29 లక్షలు అదనం.

2017లో విజేత పాకిస్థాన్‌ కు రూ.14.18 కోట్లు, రన్నరప్‌ భారత్‌ కు రూ.7 కోట్లు దక్కాయి. సెమీస్‌ చేరిన ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ లకు రూ.3 కోట్లు చొప్పున, ఐదు-ఆరు స్థానాల్లోని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు చెరో రూ.58 లక్షలు, తర్వాతి ప్లేస్‌ లలని శ్రీలంక, న్యూజిలాండ్‌కు రూ.39 లక్షలు పొందాయి.

Tags:    

Similar News