సెహ్వాగ్ అంటే ఎవరు? బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ బలుపు మాటలు

క్రీడల్లో క్రీడాస్ఫూర్తి ముఖ్యం.. గెలుపు-ఓటములు, విమర్శలు-ప్రశంసలు సమానంగా స్వీకరించాలి.

Update: 2024-06-14 07:17 GMT

క్రీడల్లో క్రీడాస్ఫూర్తి ముఖ్యం.. గెలుపు-ఓటములు, విమర్శలు-ప్రశంసలు సమానంగా స్వీకరించాలి. తమ ప్రతిభతో అవతలి వారిని మెప్పించాలి. ప్రవర్తనతో మనసులు గెలవాలి. అయితే, కొందరు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా ప్రవర్తిస్తుంటారు. చేతలు, మాటలతో విపరీతంగా ట్రోల్ అవుతుంటారు. ఇలాంటివారిలో ముందుంటాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్. ప్రతిభావంతుడైన క్రికెటర్ అయినప్పటికీ.. అతడి ప్రవర్తన మాత్రం చాలా వైల్డ్ గా ఉంటుంది. దీంతోనే తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.

18 ఏళ్లకే జాతీయ జట్టులోకి..

1987లో పుట్టిన షకిబుల్ హసన్ 2006లోనే బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం అత్యంత సీనియర్ ఇతడే అనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఇటీవలి బంగ్లాదేశ్ ఎన్నికల్లో మగురా-1 నియోజకవర్గం నుంచి షకిబ్ ఎంపీగా గెలిచాడు. అధికార పార్టీ అయిన అవామీలీగ్ తరఫున విజయం సాధించాడు.

విపరీత ప్రవర్తనతో..

తనపై ఇష్టంతో మైదానంలోకి వచ్చిన అభిమానుల మీద దాడి నుంచి అనేక విషయాల్లో షకిబుల్ తీరు తీవ్ర వివాదాస్పదం అయింది. దేశవాళీ టీ20 లీగ్ లో అంపైర్ తో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు వికెట్లను తన్నాడు. వాటిని తీసి గ్రౌండ్కేసి కొట్టాడు. దీంతో అతడిపై నాలుగు మ్యాచ్ల నిషేధం విధించారు.

విమర్శలను తట్టుకోలేడు..

షకిబుల్ తాజాగా మరోసారి వార్తల్లో చర్చనీయాంశం అయ్యాడు. భారత్ కు చెందిన డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ ను తక్కువ చేసి మాట్లాడాడు. ‘‘నువ్వేమీ గిల్ క్రిస్ట్, హెడెన్ కాదు.. బంగ్లా ఆటగాడివి. నీకు తెలిసినట్లే ఆడు’’ అంటూ పరిమితులను సూచిస్తూ, సెహ్వాగ్ మంచి సూచన చేయగా, షకిబ్ దానిని తీవ్రంగా తీసుకున్నాడు. ‘‘ఇంతకూ వీరేంద్ర సెహ్వాగ్ ఎవరు’’?? అంటూ జర్నలిస్ట్ ను ప్రశ్నించాడు. దీనిపై ఇప్పుడు పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

సెహ్వాగ్ ఎవరో రికార్డులను అడుగు..

షకిబుల్ కేవలం తన బలుపుతోనే సెహ్వాగ్ ను కించపరిచాడు. వాస్తవానికి 2006-14 మధ్య సెహ్వాగ్ తో ఎన్నో మ్యాచ్ లు ఆడాడు. అంతెందుకు? 2011 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో సెహ్వాగ్ చెలరేగి సెంచరీ కొట్టింది బంగ్లాదేశ్ మీదనే. ఇక వ్యక్తిగతంగా టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఘనత సెహ్వాగ్ ది. అలాంటివాడిని పట్టుకుని ‘‘ఎవరు?’’ అని అడగడం అంటే అది కేవలం బలుపు మాత్రమే.

Tags:    

Similar News