'ఆచార్య' ఆ పోరాటవీరుడి కథేనట!

Update: 2022-01-10 03:40 GMT
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో, చిరంజీవి సరసన కథానాయికగా కాజల్ సందడి చేయనుంది. ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఆయన జోడిగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా నక్సలైట్లుగా కనిపించనున్నారు. 'సుబ్బారావు పాణిగ్రాహి జీవితం ' అనే పుస్తకం ఆధారంగా కొరటాల ఈ సినిమాను రూపొందించినట్టుగా చెప్పుకుంటున్నారు.

సుబ్బారావు పాణి గ్రాహి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు. 1970లలో ఆయన శ్రీకాకుళం వచ్చి అక్కడి శివాలయంలో పూజారిగా పనిచేశారు. ఆ సమయంలో దేవాలయ భూములను ఆక్రమించడానికి కొందరు భూస్వాములు ప్రయత్నించగా ఆయన అడ్డుపడ్డారు. ధైర్యసాహసాలతో ఆయన వాళ్లకి వ్యతిరేకంగా పోరాడారు. దేవాలయ భూములను కాపాడటానికి తనశక్తి మేరకు కృషి చేశారు. ఆ సమయంలోనే ఇద్దరు నక్సలైట్లు ఆయన పోరాటానికి అండగా నిలిచారు. తమ ప్రాణాలకి తెగించి ఆయన ఆశయ సాధనకి తమవంతు సహాయ సహకారాలను అందించారు.

 ఈ ఇద్దరు నక్సలైట్లు కూడా ఒక వైపున పోరాటం చేస్తూనే .. మరో వైపున ఉపాద్యాయులుగా మారిపోయి  అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేశారట. సుబ్బారావు పాణిగ్రాహి పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని, ఆ కథలోని కొన్ని అంశాలలో చిన్నపాటి మార్పులు చేసి కొరటాల 'ఆచార్య' సినిమాగా చేశాడని అంటున్నారు. ఈ కథలో కనిపించే ఆ ఇద్దరు నక్సలైట్ల పాత్రలనే చిరంజీవి - చరణ్ పోషించారన్నమాట. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఆ నక్సలైట్లు ఉపాధ్యాయులుగా మారడం వలన, కొరటాల ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ ను సెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 'లాహే లాహే' .. 'నీలాంబరి' .. 'సానా కష్టం' వంటి పాటలు జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయాయి. ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టడం కోసం మణిశర్మ గట్టిగానే కసరత్తు చేశాడనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నప్పటికీ, అప్పటి కరోనా తీవ్రతపై అది ఆధారపడి ఉంటుంది. మెగా అభిమానులు ఈ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు.      
Tags:    

Similar News