రాజమౌళి ఆ సంగతి ముందే చెప్పాడు-శేష్

Update: 2016-02-24 17:30 GMT
‘బాహుబలి’లో భద్ర పాత్ర గురించి విడుదలకు ముందు చాలా ముచ్చట్లు చెప్పాడు అడివి శేష్. తీరా సినిమాలో చూస్తే అది చాలా చిన్న పాత్ర. పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. ఈ పాత్ర గురించా ఆడియో వేడుకలోనూ అంత మాట్లాడాడు అనుకున్నారంతా. ఐతే అప్పుడు ఏం మాట్లాడినప్పటికీ.. ఆ పాత్ర అంత చిన్నదన్న సంగతి తనకు ముందే రాజమౌళి చెప్పాడని.. తనకిష్టమైతేనే చేయమని కూడా చెప్పాడని అంటున్నాడు శేష్. ‘‘ బాహుబలిలో పాత్ర చిన్నదే అని నాకు ముందే చెప్పారు. ఇష్టమైతేనే చేయమని రాజమౌళి అన్నాడు. ఇంత భారీ ప్రాజెక్టులో నాకు చెప్పిందానికంటే చిన్న పాత్ర అయినా సరే చేయాల్సిందే అని గట్టిగా అనుకుని ఈ సినిమాలో నటించా. నా పాత్ర చిన్నదన్న ఫీలింగ్ నాకేమీ లేదు’’ అని శేష్ అన్నాడు.

తన కొత్త సినిమా ‘క్షణం’ గురించి చెబుతూ.. ‘‘క్షణం థ్రిల్లర్ ప్లస్ రొమాంటిక్ మూవీ. నిడివి గంటా యాభై నిమషాలు మాత్రమే ఉంటుంది. సినిమాకు అవసరమైన మేరకే మూడు పాటలు మాత్రమే పెట్టాం. అవి కూడా కథను ముందుకు నడిపించడానికే ఉపయోగపడతాయి. గతంలో వచ్చిన ఏ సినిమాలకు ‘క్షణం’తో పోలిక ఉండదు. ఇది పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్. కథ నచ్చి.. పీవీపీ లాంటి పెద్ద సంస్థ నిర్మించడానికి ముందుకొచ్చింది. అది నిజంగా మా అదృష్టం. అలాంటి పెద్ద సంస్థ నిర్మించడం వల్ల సినిమా జనంలోకి వేగంగా వెళ్తుంది. ఈ సినిమా బాలేదు అనిపించుకునే ప్రసక్తే లేదు’’ అన్నాడు శేష్. త్వరలోనే తన అన్న సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తనే హీరోగా ఓ సినిమా చేస్తన్నట్లు శేష్ వెల్లడించాడు.
Tags:    

Similar News